‘లోపాన్నే’ కాదు.. మతాన్నీ దాచారు
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:01 AM
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కొన్ని వీడియోలు విడుదల చేసి, తన విషయంలో చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాస్తవాలు ఇవే అంటూ మీడియా ముందుకు వచ్చారు.
రాజకీయం కోసమే నాపై నిందలు.. అన్నీ తెలిసే జోగి నా గొంతు కోశారు
భర్త రాజీవ్‌కు ట్రీట్‌మెంట్ చేయిస్తాం.. అప్పటిదాకా దూరంగా వెళ్లమన్నారు
చికిత్స ఖర్చులూ పెట్టుకోవాలని అన్నారు
న్యాయం కోసమే కృష్ణప్రసాద్ వద్దకు..
దానికి ముందు సజ్జల వద్దకూ..
దేవుళ్ల ఫొటోలతో ఇంటికి వెళితే కొట్టారు
గోరుముద్దలు కాదు.. విషపు ముద్దలు పెట్టారు
ఇప్పటిదాకా కొన్నే వీడియోలు బయటపెట్టా
కుటుంబంతో కలిసి మీడియా ముందుకు మేఘన
విజయవాడ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కొన్ని వీడియోలు విడుదల చేసి, తన విషయంలో చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాస్తవాలు ఇవే అంటూ మీడియా ముందుకు వచ్చారు. తన కుటుంబంతో కలిసి ఆమె మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇంటి గుట్టు ను మేఘన టీడీపీ నేతల వరకు తీసుకెళ్లారని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను కలిశారంటూ మాజీ మంత్రి జోగి రమేశ్ సోమవారం కొన్ని వీడియోలు విడుదల చేశారు. వీటిపై తన వాదనను వినిపిస్తూ, జోగి రమేశ్‌ను ఉద్దేశించి మేఘన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్‌కు ఉన్న లోపం గురించి ముందే తెలిసినా, రమేశ్ తన గొంతు కోశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘గొడవలు మొదలయ్యాక ఒకరోజు మా అత్త నాతో మాట్లాడారు. ‘రాజీవ్‌కు ట్రీట్‌మెంట్ చేయిస్తాం. అంతవరకు మీ ఇంటికి వెళ్లిపో.. ట్రీట్‌మెంట్‌కయ్యే ఖర్చు కూడా మీ కుటుంబమే భరించాలి’ అన్నారు. ఇప్పుడేమో మా అత్త గోరుముద్దలు పెట్టిందని రమేశ్ అంటున్నారు. నిజానికి, ఆమె నాకు విషపు ముద్దలు పెట్టింది’’ అని మేఘన మండిపడ్డారు. మీ కుమార్తెకు ఇలా జరిగితే ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
న్యాయం కోసం మేమే వెళ్లాం.. ‘‘మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వద్దకు మేమే వెళ్లాం. జోగి రమేశ్ దాన్ని రహస్యంగా వీడియో తీసి మీడియాకు చూపించారు. జరిగిన అన్యాయం గురించి ఎమ్మెల్యే కు వివరించాం. ఆయన రమేశ్ బాబాయ్ వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి, వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని సూచించారు. నాకు అన్యాయం జరిగిన మాట నిజమేనని వెంకటేశ్వర్లు కూడా ఒప్పుకొన్నారు.’’
ఆ గొడవలేంటో జోగి బయటకు చెప్పాలి
‘‘రాజీవ్‌కు, నాకు మధ్య అభిప్రాయ భేదాల వల్ల గొడవ లు జరిగాయని రమేశ్ చెబుతున్నారు. ఆ గొడవలేంటో ఆయన బయటకు చెప్పాలి. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాసిన అంశాలన్నీ వాస్తవాలే. మీడియాలో ప్రసారమైన వీడియోలను ఏఐలో తయారు చేశారని జోగి అంటున్నారు. నావద్ద ఉన్న కొన్ని వీడియోలు మాత్రమే పోలీసులకు అం దజేశా. ఇంకా చాలా వీడియోలు భద్రంగా ఉంచాను. సమ యం వచ్చినప్పుడు వాటిని బయట పెడతా. బయటకు వచ్చిన వీడియోలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపితే అవన్నీ ఏఐలో తయారైనవా, ఒరిజినలా అన్నది తేలుతుంది. నా ఫోన్‌ను ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను.’’
గోరు ముద్దలు కాదు.. విషపు ముద్దలు
‘‘రాజీవ్ తల్లి శకుంతల నన్ను కూతురిలా చూసుకుందని రమేశ్ చెప్పారు. అలా చూసుకుంటే అమ్మలా గోరుముద్దలు పెడతారు. కానీ, శకుంతల నాకు విషపు ముద్దలు పెట్టారు. రాజీవ్ లోపాలు తెలిసీ పెళ్లి చేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్తే.. ఎలాంటి కేసులు వద్దని రమేశ్ మా లాయర్‌తో మధ్యవర్తిత్వం పంపారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద మాట్లాడుకుందామని ఆయనే ప్రతిపాదించారు. దీంతో సజ్జల వద్దకు వెళ్లాం. ఆ భేటీలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. అక్కడ ఇచ్చిన మాటపై రమేశ్ నిలబడలేదు. అందుకేపోలీసులకు ఫిర్యాదు చేశాను. కోర్టులు, కేసులు వద్దని, న్యాయం చేస్తామని సజ్జల మాటిచ్చారు. జగన్‌ను కలవలేకపోయాం. పెళ్లయిన 2 నెలలకే రాజీవ్ విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.’’
పూజలు చేస్తే కొట్టారు.. ‘‘రాజీవ్ నా మెడలో తాళి కట్టే వరకు వారి ఇంట్లో హిందూ దేవుళ్ల ఫొటోలు ఉన్నాయి. ఆ తర్వాత కనిపించ లేదు. రాజీవ్‌కు ఉన్న లోపాన్నే కాదు మతాన్నీ దాచిపెట్టి వివాహం చేశారు. క్రైస్తవం తీసుకున్న విషయాన్ని చెప్పకుండా మోసం చేశారు. పెళ్లయిన కొన్ని రోజులకు.. మూడో అంతస్తులో పూజలు చేసుకోవడానికి ఒక గది ఇచ్చారు. అగరబత్తులు వెలిగించాలన్నా, గంట మోగించాలన్నా భయపడాల్సిన పరిస్థితి. అత్త శకుంతల వచ్చి దేవుళ్ల ఫొటోలను చూసి, అవమానకరంగా మాట్లాడారు. ‘మీ దేవుళ్లూ దేవుళ్లేనా? మనుషుల్లాగా వారికి ఇద్దరేసి భార్యలు ఉన్నారు’ వ్యాఖ్యానించారు. పుట్టింటి నుంచి వచ్చినప్పుడు దేవుడి ఫొటో తీసుకొచ్చి పూజ చేస్తే కొట్టారు. అదనపు కట్నం తీసుకొస్తేనే రాజీవ్‌కు ఫీలింగ్స్ వస్తాయని చెప్పారు. ఒక తల్లి స్థానంలో ఉన్న శకుంతల.. అనేక రకాలుగా హింసించారు.’’
అలా అనుకోకూడదనే ఇలా వచ్చా
‘‘రోడ్డు మీదకు వచ్చింది...మీడియాకు ఎక్కింది...చివరికి ఏం సాధించింది’ అని ఇతరులు అనుకోవచ్చు. అలా అనుకోకుండా ఉండడానికే న్యాయం కోసం పోరాటం చేస్తున్నాను. నాకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను. నాకు చేసిన మోసానికి, అన్యాయానికి రమేశ్ సమాధానం చెప్పాలి. రమేశ్ అసలు వాస్తవాలు వదిలేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.’’ అని మేఘన అన్నారు.
జోగి ఇంటి ముందు టెంట్ వేస్తాం: అనంతకృష్ణ గౌడ్
తన కుమార్తెకు న్యాయం జరగని పక్షంలో జోగి రమేశ్ ఇంటి ముందు టెంట్ వేసుకుని, కూర్చుంటామని మేఘన తండ్రి అనంతకృష్ణ గౌడ్ హెచ్చరించారు. ‘‘మేఘనకు జరిగిన అన్యాయం గురించి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌కు చెప్పాను. అయితే, వారిని రమేశ్ అడ్డుకున్నారు. నన్ను ఏ రోజు కూడా గౌరవంగా చూడలేదు. మాకు రాజకీయ నేపథ్యం లేదు. నెల రోజులుగా రమేశ్ అనుభవించిన మానసిక క్షోభ కంటే, ఏడాది కాలంగా మేం ఎక్కువ మానసిక క్షోభనే అనుభవిస్తున్నాం. గొడవలు సద్దుమణగాలని ప్రయత్నించినా, రమేశ్ కుటుంబం సామరస్యంగా వ్యవహరించలేదు. నా కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన పాపం జోగి రమేశ్‌దే. పెళ్లయిన రెండు నెలలకే విడాకుల కోసం కోర్టుకు వెళ్లారంటే వారి బుద్ధి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాకు న్యాయం చేయాలి’’ అని అభ్యర్థించారు.