ఓ వైపు చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. మరోవైపు రక్షణ కోరుతున్నారు!
ABN , Publish Date - Feb 03 , 2026 | 06:19 AM
తమ ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు రోహిత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై జోగి రమేశ్ అసభ్యకర వ్యాఖ్యలు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు
ఉపశమన ఉత్తర్వులకు ఆయన అనర్హుడు
అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించండి
హైకోర్టును కోరిన హోంశాఖ న్యాయవాది
అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తమ ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు రోహిత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది జయంతి వాదనలు వినిపిస్తూ.. జోగి రమేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వివరించారు. ఓవైపు చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. మరోవైపు రక్షణ కల్పించాలని పిటిషన్లు వేస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు నుండి ఉపశమన ఉత్తర్వులు పొందేందుకు ఆయన అనర్హుడన్నారు. అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయకుండా రమేశ్‌ను నియంత్రించాలని కోరారు. ప్రస్తుతం పిటిషనర్ నివాసం వద్ద 15 మంది పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ చెబుతున్నట్లుగా ఆయన నివాసం వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని, ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితి ఉందని నివేదించారు. ఆయన ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారన్నారు.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు.. పిటిషనర్ నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌కు సూచిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించారు. తమ ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ జోగి రోహిత్ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేశారు. సోమవారం విచారణ ప్రారంభమైన వెంటనే.. వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి అభ్యర్ధించారు. దీంతో కోర్టు లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రమేశ్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ నిలబడ్డారన్నారు. రమేశ్‌పై కేసు నమోదు చేశారని, పోలీసులు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ముందస్తు బెయిల్ దాఖలు చేసుకోవాలని ఆ న్యాయవాదికి సూచించారు.