Share News

జోగి నేరచరితుడు

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:14 AM

వైసీపీ నేత జోగి రమేశ్‌ కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశా రని పోలీసులు హైకోర్టుకు నివేదించారు.

జోగి నేరచరితుడు

  • అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు అనర్హుడు: పీపీ

అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత జోగి రమేశ్‌ కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశా రని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. సీఎం చంద్రబాబును, మంత్రి లోకేశ్‌ను అసభ్య పదజాలంతో దూషించారని.. నేర చరితుడైన ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించవద్దని కోరారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేలా జోగి జనవరి 31న ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ తిరుపతి గ్రామీణ మండలం టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడుకు చెందిన కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ జోగి రమేశ్‌ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిరోధించాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ‘పిటిషనర్‌ కేవలం రాజకీయ విమర్శలే చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఆయనకు వర్తించవు. ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేశారు. పోలీసులు పేర్కొన్న సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవే. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి’ అని కోరారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ‘కల్తీ మద్యం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత జోగి రమేశ్‌ ప్రెస్‌మీట్‌లు పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు తీవ్ర పదజాలంతో దూషించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం అలవాటుగా మారింది. అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు పిటిషనర్‌ అనర్హుడు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీచేయొద్దు’ అని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదన లు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.

Updated Date - Feb 05 , 2026 | 05:15 AM