Share News

జోగి బ్రదర్స్‌కు బెయిల్‌!

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:21 AM

నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

జోగి బ్రదర్స్‌కు బెయిల్‌!

  • నకిలీ మద్యం తయారీ కేసులో మంజూరు

  • అయినా బయటకు రాలేని పరిస్థితి

  • మరో కేసులో బెయిల్‌ పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ

విజయవాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విజయవాడలోని భవానీపురం ఎక్సైజ్‌ పోలీసులు నమోదు చేసిన నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్‌ ఏ18గా, రాము ఏ19గా ఉన్నారు. ఈ కేసులో తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం వీరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై వాదప్రతివాదనలు ముగియడంతో న్యాయాధికారి జి.లెనిన్‌బాబు మంగళవారం తీర్పును వెలువరించారు. ఇరువురికీ బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని నిర్దేశించారు. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఈ కేసులో నిందితులు, సాక్షులుగా ఉన్నవారిని కలవరాదని షరతులు విధించారు. జోగి బ్రదర్‌ను గతేడాది నవంబరు 2న ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. తొలుత నెల్లూరులోని కేంద్ర కారాగారంలో వీరిని ఉంచారు. తర్వాత కోర్టు ఆదేశాలతో విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటి వరకు 80 రోజులపాటు వీరు జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌ మంజూరైనా వీరు బయటకు రాలేని పరిస్థితి ఉంది. ములకలచెరువు ఎక్సైజ్‌ పోలీసులు నమోదు చేసిన కేసులోనూ వీరు నిందితులుగా ఉన్నారు. ఆ కేసులోనూ వీరు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిపై మదనపల్లె కోర్టులో విచారణ కొనసాగుతోంది. దీంతో ఇక్కడి కోర్టులో బెయిల్‌ వచ్చినప్పటికీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి.

Updated Date - Jan 21 , 2026 | 04:39 AM