MP Sribharat: నైపుణ్యాలతోనే ఉద్యోగాలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 06:08 AM
కృత్రిమ మేధ రాకతో పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలా ఆధునిక సాంకేతికలను అందిపుచ్చుకున్నవారే భవిష్యత్తులో నిలదొక్కుకుంటారని...
డిజిటల్ టెక్నాలజీ సదస్సులో విశాఖ ఎంపీ శ్రీభరత్
విశాఖపట్నం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ రాకతో పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలా ఆధునిక సాంకేతికలను అందిపుచ్చుకున్నవారే భవిష్యత్తులో నిలదొక్కుకుంటారని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. విశాఖపట్నంలోని సిరిపురం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సు-26 రెండో ఎడిషన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులతో కంపెనీలు తీసుకొస్తోందని, వాటి ద్వారా కేవలం ఉత్తరాంధ్రలోనే ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తాయని, వాటిని అందిపుచ్చుకోవాలంటే తగిన నైపుణ్యం ఉండాలన్నారు. ఇదే వేదికపై రెండు స్టార్టప్‌లతో ఎస్‌టీపీఐ అవగాహన ఒప్పందాలు మార్చుకుంది. ఏపీడీటీఐ నెట్‌వర్క్ చైర్మన్ శ్రీధర్ కొసరాజు, ఎస్‌టీపీఐ డిప్యూటీ డైరెక్టర్ కవిత, హెచ్‌సీఎల్ జీసీసీ గ్లోబల్ లీడర్ కిరణ్‌బాబు చెరుకూరి, ఐటాప్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి కిశోర్, తదితరులు ప్రసంగించారు. కాగా, సదస్సులో రోబోలు సందడి చేశాయి. కాకినాడ కైట్ సంస్థ విద్యార్థులతో ఓ రోబో స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అందులో యునిట్రీ జీ1 హ్యూమనాయ్డ్ రోబో అందరినీ ఆకట్టుకుంది. సెల్యూట్ కొట్టడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, మోకాళ్లపై కూర్చోవడం వంటివి చేసింది. ఇలాంటి రోబోలను ఆర్డర్లపై అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ అమర్చి పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.