Job Aspirants: జాబ్ క్యాలెండర్ ఎప్పుడు?
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:24 AM
జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం
మరో 12 రోజుల్లో నెల ముగింపు
లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు
మెగా డీఎస్సీతో టీచర్ పోస్టుల భర్తీ
ఇప్పుడు మళ్లీ డీఎస్సీ జారీకి సిద్ధం
వైసీపీ హయాంలో పట్టించుకోని జగన్
జాబ్ క్యాలెండర్ హామీపైనా, డీఎస్సీపైనా మడమ తిప్పేసిన వైసీపీ నేత
ప్రస్తుత సర్కారుపైనే నిరుద్యోగుల ఆశలు
2019 ఎన్నికలకు ముందు 2.3 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. అధికారం చేపట్టాక మడమ తిప్పారు. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి.. ఐదేళ్లలో ఒకే ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అయితే, ఆ ఒక్కటి కూడా అమలుకాలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంపైనే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇటీవల మంత్రి లోకేశ్ ప్రకటించారు. దీంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం కలిగింది. అయితే, ఈ నెల ముగియడానికి మరో 12 రోజులే ఉండటంతో ఈ నెలలో క్యాలెండర్ విడుదల చేస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, జాబ్ క్యాలెండర్ కోసం ఎక్స్, ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా నిరుద్యోగుల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఎదురుచూపులు ఇప్పటివి కావు
గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు సక్రమంగా జారీ చేసి ఉంటే ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేది కాదు. 2019 ఎన్నికలకు ముందు 2.3 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. అధికారం చేపట్టాక దాని ఊసెత్తలేదు. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీలు ఇచ్చి ఐదేళ్లలో ఒకే ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అయితే ఆ ఒక్కటి కూడా అమలుకాలేదు. మొత్తం వైసీపీ హయాంలో సుమారు 5 వేల ప్రభుత్వ ఉద్యోగాలే భర్తీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొన్నప్పటికీ అవి కొత్తగా సృష్టించినవే తప్ప అప్పటికే ఉన్న ఖాళీలు కాదు. 2019 ఎన్నికలకు ముందు ఆ సమయంలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ అనేకసార్లు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక సచివాలయాలు మినహా ఉపాధ్యాయ సహా ఇతర ఉద్యోగాల భర్తీ జోలికి వెళ్లలేదు. దీంతో ఐదేళ్లపాటు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసిన నిరుద్యోగులు కూటమి ప్రభుత్వం అయినా తమ ఆశలు నెరవేరుస్తుందనే భావిస్తున్నారు. గత ప్రభుత్వం సక్రమంగా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఏడాదిన్నర గడిచిపోవడంతో ఆ డిమాండ్లు ఇప్పుడు మరింతగా పెరుగుతున్నాయి.
డీఎస్సీపై ఉన్న శ్రద్ధ లేదు
సాధారణంగా టీడీపీ ప్రభుత్వం అంటే ‘డీఎస్సీ’ కచ్చితంగా ఇస్తారనే ముద్ర ఉంది. దీనికి అనుగుణంగానే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనివిధంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలచేసి ఒకేసారి 16 వేల టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసింది. ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద మైలేజీ తెచ్చిపెట్టింది. మెగా డీఎస్సీ ఇస్తామన్న జగన్.. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరోవైపు వచ్చే ఫిబ్రవరిలో మరో డీఎస్సీ ఇచ్చేందుకు కూడా ప్రస్తుత సర్కారు సిద్ధమైంది. అలాగే ఇకపై ఏటా డీఎస్సీ ఇస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అయితే, డీఎస్సీలపై ఉన్న శ్రద్ధ ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లపై పెద్దగా కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో తమకూ డీఎస్సీ తరహాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
మిగిలిపోయిన పోస్టులకే
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చాక గత ఏడాది ఏపీపీఎస్సీ సుమారు 80 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీచేసింది. అవి కూడా అంతకముందు ఇచ్చిన నోటిఫికేషన్లలో భర్తీకాకుండా మిగిలిపోయిన ‘క్యారీ ఫార్వర్డ్’ పోస్టులే. మరోవైపు, అంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 905 పోస్టులతో గ్రూప్-2, 89 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్లు 2023 చివర్లో విడుదల కాగా ఇప్పటివరకు వాటి తుది ఫలితాలు రాలేదు. న్యాయ వివాదాలతో ఎప్పటికప్పుడు ఫలితాలు వాయిదాలు పడుతున్నాయి. మరోవైపు యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది పోస్టులు 3 వేలకు పైగా ఖాళీగా ఉన్నాయి. పలు న్యాయ వివాదాలతో వాటికీ ముందడుగు పడటం లేదు. యూనివర్సిటీ బోధనా సిబ్బంది పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే జాబ్ క్యాలెండర్‌లో ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిలావుంటే, 25 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో క్యాలెండర్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.