విద్యార్థులు, టీచర్లకు జియో ఏఐ తరగతులు
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:15 AM
రాష్ట్రంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై నాలుగు వారాల ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సును ఉచితంగా అందించేందుకు ప్రముఖ జియో సంస్థ ముందుకొచ్చింది.
ఉచితంగా జెమిని 3ప్రొ సబ్‌స్ర్కిప్షన్
అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై నాలుగు వారాల ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సును ఉచితంగా అందించేందుకు ప్రముఖ జియో సంస్థ ముందుకొచ్చింది. ఆధునిక కాలంలో బోధన, అభ్యసన పద్ధతులను మెరుగుపరచుకునేందుకు గూగుల్ జెమిని ప్రొను ప్రాక్టికల్‌గా ఎలా వినియోగించుకోవాలనేది ప్రధానాంశంగా ఈ ఆన్‌లైన్ కోర్సును తీసుకొచ్చింది. దీనిపై ఇప్పటికే 1,500 పాఠశాలల్లో అవగాహన కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 20వేల మంది టీచర్లు, విద్యార్థులు ఇందులో నమోదు చేసుకునేలా ప్రణాళిక అమలుచేస్తోంది. ఇందులో భాగంగా రూ.35,100 విలువైన సబ్‌స్ర్కిప్షన్ ప్యాకేజీని టీచర్లు, విద్యార్థులు పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఈ సబ్‌స్ర్కిప్షన్ ద్వారా జెమిని 3ప్రొ, హైఎండ్ క్రియేటివ్ టూల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే నోట్‌బుక్ ఎల్‌ఎమ్ అకడమిక్ రిసెర్చ్ టూల్, 2 టీబీ క్లౌడ్ స్టోరేజీ కూడా లభిస్తాయి. జియో ఏఐ క్లాస్‌రూమ్ పోర్టల్‌లో ఈ సేవలు వినియోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.