Share News

జేఈఈలో తెలుగు సత్తా

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:51 AM

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 21-28 వరకు దేశవ్యాప్తంగా 326 నగరాల్లో 658 కేంద్రాల్లో తొలివిడత జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించగా..

జేఈఈలో తెలుగు సత్తా

  • ముగ్గురికి 100 పర్సంటైల్‌

  • ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒకరు

  • దేశవ్యాప్తంగా మరో 9 మందికి కూడా..

  • జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-1 ఫలితాలు విడుదల

  • రాజస్థాన్‌ నుంచి అత్యధికంగా ముగ్గురు టాపర్లు

  • 99.99తో ఎస్సీల్లో టాపర్‌గాఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 21-28 వరకు దేశవ్యాప్తంగా 326 నగరాల్లో 658 కేంద్రాల్లో తొలివిడత జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించగా.. 13.04 లక్షల మంది హాజరయ్యారు. పేపర్‌-1 (బీఈ, బీటెక్‌) ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఎజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 12 మంది పూర్తి మార్కులు (100 పర్సంటైల్‌) సాధించారు. వీరిలో అత్యధికంగా రాజస్థాన్‌ నుంచి ముగ్గురు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒకరు ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందుపురానికి చెందిన నరేంద్రబాబుగారి మహిత్‌, కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్‌లు ఏపీ నుంచి 100 పర్సంటైల్‌ సాధించారు. హైదరాబాద్‌ విద్యార్థి వివాన్‌ శరద్‌ మహీశ్వరి 100 పర్సంటైల్‌ సాధించిన 12 మందిలో ఉన్నారు. దేశస్థాయిలో ఓబీసీ-ఎన్‌సీఎల్‌ కోటాలో వంద పర్సంటైల్‌ సాధించిన విద్యార్థిగా మహిత్‌ నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవ శ్రీవేశ్‌ 99.9992271 పర్సంటైల్‌తో ఎస్సీ విభాగంలో ఆలిండియా టాపర్‌గా నిలిచారు. జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసిన వారిలో 8.87 లక్షలు అబ్బాయిలుండగా, 4.67 లక్షల మంది అమ్మాయిలున్నారు. టాపర్లలో అందరూ అబ్బాయిలే ఉండటం విశేషం. హరియాణాకు చెందిన ఆవీ గ్రేవాల్‌ 99.996 పర్సంటైల్‌తో అమ్మాయిల్లో అత్యధిక పర్సంటైల్‌ సాధించి టాపర్‌గా నిలిచారు. పేపర్‌-2 బి-ఆర్క్‌, బి-ప్లానింగ్‌ పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 జరుగుతుంది. రెండు సెషన్లకు కలిపి ర్యాంకులు ప్రకటించిన తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరుగుతాయి.


చదువుల కోసం హిందూపురం నుంచి తిరుపతికి

నరేంద్రబాబుగారి మహిత్‌ తిరుపతిలోని నారాయణ ఐఐటీ అకాడమీలో చదివారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన మహిత్‌ చదువు నిమిత్తం అతని తల్లిదండ్రులు మూడేళ్ల కిందట తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. మహిత్‌ తండ్రి నరేంద్రబాబు తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తమ కుమారుడి తెలివితేటలపై నమ్మకంతో తిరుపతికి వచ్చి ఎంతో కష్టపడి చదివించినందుకు, ఫలితం దక్కిందని మహిత్‌ తల్లిదండ్రులు తెలిపారు. కాగా, మహిత్‌ను నారాయణ ఐఐటీ అకాడమీ డీజీఎం కొండలరావు, తదితరులు అభినందించారు. దేశంలో 12 మంది విద్యార్థులు నూటికి నూరు పర్సెంటైల్‌ సాధించగా.. వారిలో మహిత్‌ ఉండటం తమకు గర్వకారణమన్నారు.

తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే

కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్‌ 300 మార్కులకు 300 మార్కులు సాధించారు. మోహిత్‌ తండ్రి కిరణ్‌కుమార్‌ ప్రొద్దుటూరులో డాక్టర్‌గా, తల్లి సబిత జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో డెంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. మోహిత్‌ 10వ తరగతి గుడివాడ కేకేఆర్‌లో, ఇంటర్‌ విజయవాడలోని చైతన్య జూనియర్‌ కళాశాలలో చదివారు. తొలి ప్రయత్నంలోనే మోహిత్‌ సాధించిన ఈ విజయంతో కుటుంబసభ్యులు, గురువులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఏఐ రంగంలో స్థిరపడతా

మా అమ్మా నాన్న మొదటి నుంచీ.. నాపై ఎంతో నమ్మకం పెట్టుకొని కష్టపడి చదివించారు. కళాశాలలో అధ్యాపకులు నిత్యం చెప్పే సూచనలను పాటిస్తూ కష్టపడి చదవడం వల్లే ఈ రోజు ఈ విజయం సాధ్యపడింది. ఇందుకోసం రోజూ దాదాపు 18 గంటలు చదివే వాడిని. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో బాంబే ఐఐటీలో సీటు సాధించి, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ) రంగంలో స్థిరపడాలనేదే నా లక్ష్యం.

- నరేంద్రబాబుగారి మహిత్‌

బాంబే ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవటం లక్ష్యం

జేఈఈ మెయిన్స్‌లో వందకు వంద మార్కులు రావడం చాలా అనందంగా ఉంది. బాంబే ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయడమే నా లక్ష్యం. ప్రతిరోజు నాలుగు గంటలు మాత్రమే చదువుతూ పరీక్షకు సన్నద్ధమయ్యేవాడిని. కుటుంబసభ్యుల నుంచి కానీ, చదివే సమయంలో కానీ ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతోనే జేఈఈ మెయిన్స్‌లో టాప్‌ ర్యాంకు సాధించగలిగాను. మా అమ్మ, నాన్న ఇద్దరూ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులుగా చేస్తున్నారు. వారి నుంచి ఎప్పుడూ చదువు విషయంలో, ర్యాంకు సాధించాలనే ఒత్తిడి లేదు.

- పసల మోహిత్‌

అమెరికా వద్దని ఐఐటీ ఎంచుకున్నా..

విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా చదివాను. కళాశాల అధ్యాపకుల మార్గదర్శకంతో ఈ విజయం సాధ్యమైంది. నాన్న వ్యాపారవేత్త, అమ్మ సీఏ. స్వస ్థలం ఢిల్లీ అయునా చిన్నప్పుడే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇంటర్‌ తర్వాత గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికాకు పంపాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. తాను ఇక్కడే ఉండి ఐఐటి బాంబేలో ప్రవేశం పొందడం లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఐఐటీబాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాలనేది నా లక్ష్యం.

- వివాన్‌ శరద్‌మహీశ్వరి

Updated Date - Feb 17 , 2026 | 04:54 AM