గల్ఫ్ - విజయవాడ మధ్య జజీరా ఎయిర్‌లైన్స్ విమానాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:35 AM
పశ్చిమాసియాలో యుద్ధంతో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలుగువారు స్వదేశానికి రావడానికి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. యుద్ధానికి రెండు వారాల పాటు విరామం లభించడంతో సౌదీ...
13 నుంచి 29 వరకు రిలీఫ్ ఫ్లైట్స్
సౌదీలో దమ్మమ్ ఎయిర్‌పోర్టుకు షెడ్యూల్స్
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
పశ్చిమాసియాలో యుద్ధంతో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలుగువారు స్వదేశానికి రావడానికి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. యుద్ధానికి రెండు వారాల పాటు విరామం లభించడంతో సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి, విజయవాడ మధ్య రిలీఫ్ ఫ్లైట్స్ నడపడానికి జజీరా ఎయిల్‌లైన్స్ సిద్ధమైంది. ఈనెల 13 నుంచి 29 వరకు ఆ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ మేరకు విజయవాడ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇవ్వటంతో పాటు స్లాట్‌ను బుక్ చేసుకుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో ఆ విమానాలు నడుస్తాయి. ఎయిర్‌పోర్టు అధికారులకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం విజయవాడ, దమ్మమ్‌ల మధ్యనే విమానాలు నడుస్తాయి. దమ్మమ్‌కు చేరాక అక్కడి నుంచి కువైట్‌కు కూడా ఈ సర్వీసులు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
నేటి నుంచే హైదరాబాద్‌కు ‘ఫ్లై 91’ సర్వీసులు
విజయవాడ-హైదరాబాద్ మధ్య ‘ఫ్లై 91’ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 7.30 గంటలకు నూతన విమాన సర్వీసు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. కాగా, విజయవాడ విమానాశ్రయం అద్భుతమైన ఘనతను సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 14.14 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. 2024-25లో ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 31 వేల మంది ప్రయాణికులు పెరిగారు. ఏడాది మొత్తం 17,533 విమానాలు (అన్ని ట్రిప్పులు కలిపి) తిరిగాయి. అంత క్రితం ఏడాది 16,770 విమానాలు రాకపోకలు సాగించాయి.