నా రాజీనామా ఆమోదించండి!
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:23 AM
తాను వైసీపీకి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది అయిందని, ఇంకా తన రాజీనామా ఎందుకు ఆమోదించడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకట రమణ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కోరారు.
మండలి చైర్మన్‌తో జయమంగళం
జనసేన కండువాతో విచారణకు హాజరు
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): తాను వైసీపీకి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది అయిందని, ఇంకా తన రాజీనామా ఎందుకు ఆమోదించడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకట రమణ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కోరారు. బుధవారం మండలి చైర్మన్ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. జనసేన కండువా కప్పుకొని విచారణకు వెంకటరమణ హాజరు కావడం గమనార్హం. విచారణ అనంతరం అసెంబ్లీ లాబీలో వెంకటరమణ విలేకరులతో మాట్లాడారు. తన రాజీనామా ఆమోదించాలని ఇప్పటికే పలుమార్లు కోరినా ఎందుకు ఆమోదించడం లేదని మండలి చైర్మన్‌ను అడిగానని, ఇదే అంశంలో హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశానని వెంకటరమణ తెలిపారు. తాను వైసీపీకి రాజీనామా చేసి, అధికారికంగా జనసేనలో చేరానని, అందుకే జనసేన కండువా కప్పుకొని విచారణకు వెళ్లానని అన్నారు. ‘మీ ఎదుట వేరే పార్టీ కండువా కప్పుకొని కనబడితే మీరు సస్పెండ్ చేయవచ్చు. కానీ నా రాజీనామా విషయంలో మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని కూడా చైర్మన్‌ను అడిగానని తెలిపారు. ఎవరైనా ప్రలోభ పెట్టారా.. బెదిరించారా.. అని చైర్మన్ తనను ప్రశ్నించారని, అలాంటిదేమీ లేదని, స్వచ్ఛందంగానే వైసీపీకి.. ఎమ్మెల్సీకి రాజీనామా చేశానని తెలిపానని వివరించారు. ఎన్నిసార్లు విచారణకు హాజరైనా తన నిర్ణయం ఇదేనని, ఇప్పటికైనా తన రాజీనామా ఆమోదించాలని కోరానని వెంకటరమణ వెల్లడించారు.