Share News

ఏపీకి మరో ప్రముఖ సంస్థ

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:09 AM

జపాన్‌కు చెందిన మరో ప్రముఖ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. అధునాతన మెటీరియల్స్‌ తయారీ సంస్థ ప్రొటీరియల్‌ లిమిటెడ్‌ ఏపీలోని శ్రీసిటీలో అత్యాధునిక అమార్ఫస్‌ మెటల్‌ మెటీరియల్‌ మెట్‌గ్లాస్‌ ఉత్పత్తి కేంద్రాన్ని....

ఏపీకి మరో ప్రముఖ సంస్థ

  • శ్రీసిటీలో జపాన్‌ కంపెనీ ప్రొటీరియల్‌ యూనిట్‌

  • మెట్‌గ్లాస్‌ ఇండియా లిమిటెడ్‌ పేరుతో ఏర్పాటు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): జపాన్‌కు చెందిన మరో ప్రముఖ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. అధునాతన మెటీరియల్స్‌ తయారీ సంస్థ ప్రొటీరియల్‌ లిమిటెడ్‌ ఏపీలోని శ్రీసిటీలో అత్యాధునిక అమార్ఫస్‌ మెటల్‌ మెటీరియల్‌ మెట్‌గ్లాస్‌ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించనుంది. విద్యుత్‌ ఆదా కోసం ట్రాన్స్‌ఫార్మర్లలో కోర్‌ మెటీరియల్‌గా వాడే మెట్‌గ్లాస్‌ వల్ల విద్యుత్‌ నష్టం దాదాపు 33 శాతం తగ్గనుంది. భారత్‌లో తొలిసారిగా ఎనర్జీ సేవింగ్‌ టెక్నాలజీ తరహా అధునాతన సాంకేతికతతో కూడిన ప్లాంట్‌ ఏపీకి రావడం విశేషం. ఈ ప్లాంట్‌ కోసం తొలిదశలో 77-80 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి (దాదాపు రూ.700 కోట్లు) పెట్టనున్నట్లు ప్రొటీరియల్‌ సంస్థ సీఈవో సీన్‌ స్టాక్‌ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీలో ప్రారంభించబోయే మెట్‌గ్లాస్‌ ఉత్పత్తి కేంద్రం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. విద్యుత్‌ ఆదా కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇందుకోసం మెట్‌గ్లాస్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఒక సంయుక్త భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కంపెనీలో ప్రొటీరియల్‌ 74 శాతం, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ 26 శాతం వాటాలు కలిగి ఉన్నాయని తెలిపారు. తిరుపతిలోని శ్రీసిటీలో ఏర్పాటయ్యే ఈ కంపెనీలో ఈ ఏడాది అక్టోబరు నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. ప్రారంభంలో ఏడాదికి 30 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కంపెనీని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రారంభంలో 200 మందికి, రెండో దశ పూర్తయ్యే సరికి మొత్తం 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి జపాన్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రొటీరియల్‌ సంస్థ ఇప్పటికే అమెరికా, జపాన్‌లో మెట్‌గ్లా్‌సను ఉత్పత్తి చేస్తోంది.


ఎస్సఐపీ టెక్నాలజీ్‌సకు రూపాయికే ఎకరా

విశాఖపట్నంలో సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ(ఏఎ్‌సఐపీ) టెక్నాలజీ్‌సకు ఎకరా భూమిని రూపాయికే అందిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ నిర్ణయిం తీసుకుంది. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ (ఐఎ్‌సఎం) విధానంలో భాగంగా ఈ సంస్థ రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనికోసం విశాఖ జిల్లా ఆనందపురం మండలం, తర్లువాడ గ్రామంలో 30 ఎకరాలు కేటాయిస్తూ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రైడెన్‌ ప్రతిపాదనలు అదానీకి బదలాయింపు

విశాఖలో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ స్థాపించదలచిన ఏఐ డేటా సెంటర్‌కు అందిస్తున్న ప్రోత్సాహకాలు, కేటాయించిన భూములను ఐటీశాఖ అదానీ డేటా సెంటర్‌కు బదలాయించింది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

వారీ ఎనర్జీ స్టోరేజ్‌కు 300 ఎకరాలు

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో వారీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయదలచిన లిథియం ఐయాన్‌ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ కోసం 300ఎకరాల భూమిని ఎకరా రూ.50లక్షల చొప్పున కేటాయిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు స్థాపనకు మొత్తం రూ.8,175కోట్లు పెట్టుబడి పెడతామని, 3,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వారీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌ ప్రతిపాదించింది. దీనికి ఎస్‌ఐపీసీ, ఎస్‌ఐపీబీ, మంత్రిమండలి ఆమోదించాయి.

ఆర్ష ధాతుకు 12.31 ఎకరాలు

పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడులో ఏర్పాటు చేయనున్న ఆర్ష ధాతు గ్రీన్‌ నానోటెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 12.31 ఎకరాలు కేటాయిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎంఎ్‌సఎంఈ పాలసీలో భాగంగా ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో ఈ ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులు జరిగినట్టు పరిశ్రమల శాఖ పేర్కొంది.

బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌కు నేడు భూమిపూజ

బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ ఏపీలో రూ.2,300 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఇండస్ట్రియల్‌ పార్కులో 102 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీకి శనివారం మంత్రి లోకేశ్‌ భూమి పూజ చేయనున్నారు. నిర్మాణ పనులను దశలవారీగా పూర్తిచేసి 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు వల్ల 1,750 ప్రత్యక్ష, 250 పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని, విశాఖపట్నం పారిశ్రామికంగా మరింత బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త ప్లాంట్‌లో జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ (జడ్‌ఎల్‌డీ) టెక్నాలజీని వినియోగించడం వల్ల ఇది ఎనర్జీ వినియోగాన్ని 70శాతం తగ్గిస్తుంది. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అక్షయ్‌ బన్సరీలాల్‌ అరోరా, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివేణ్‌ అక్షయ్‌ అరోరా నేతృత్వంలో ఈ ప్లాంట్‌ పనులు జరగనున్నాయి.

Updated Date - Feb 28 , 2026 | 05:09 AM