Share News

Tirumala Land Issue: టీటీడీ బోర్డుకు జంగా రాజీనామా

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:11 AM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.

Tirumala Land Issue: టీటీడీ బోర్డుకు జంగా రాజీనామా

  • తిరుమలలో భూమి నా హక్కు.. దానిని నాకే కేటాయించారు

  • అయితే ట్రస్టు పేరుతో ఇవ్వాలని అడిగితే బోర్డు ఆమోదించింది

  • బోర్డు తీర్మానాన్ని సీఎం ఎలా వద్దంటారు?

  • వాస్తవాలు తెలుసుకోకుండా కేటాయింపు రద్దు చేశారు

  • నా వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదనే రాజీనామా: జంగా

అమరావతి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శుక్రవారం మీడియా ముఖంగా ప్రకటించారు. దీంతోపాటు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుమలలో స్థలం పొందడం తన హక్కుగా ప్రకటించిన జంగా.. ‘ఆంధ్రజ్యోతి’లో రెండ్రోజులపాటు వచ్చిన కథనాలు తనను అప్రతిష్ఠ పాల్జేశాయని అన్నారు. చంద్రబాబు వాస్తవాలను పరిశీలించకుండా తన ట్రస్టుకు భూ కేటాయింపులను చేయబోమని క్యాబినెట్‌లో ప్రకటించడంతో రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ‘నాపై అనేక మంది కుట్రలు పన్ని ఆరోపణలు చేస్తున్నారు. నావల్ల ప్రభుత్వానికి, చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదనే టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేశాను. రాజీనామా పత్రాలను సీఎంకు, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి పంపించాను. తిరుమలలో భూమి నా హక్కు. అది నాకు కేటాయించినదే. నా హక్కుపై నేనెందుకు ప్రశ్నించకూడదు? గతంలో ఆ స్థలం నాకు కేటాయిస్తే.. వ్యక్తిగతంగా గెస్ట్‌ హౌస్‌ కట్టడానికి ఇబ్బందిగా ఉందని ‘ఓం శ్రీ నమో వేంకటేశ్వరస్వామి గ్లోబల్‌ ట్రస్టు’ ఏర్పాటు చేసుకున్నాను. దాని చైర్మన్‌ నేనే. ఆ ట్రస్టుకు స్థలం కేటాయించండని ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడే విన్నవించాను. కానీ వైసీపీ ప్రభుత్వంలో నేను కట్టిన డబ్బులను బోర్డు వెనక్కి ఇచ్చేసింది. అది కూడా నేను టీడీపీలో చేరుతున్నానని తెలుసుకుని వెనక్కి ఇచ్చేశారు. ఆ తర్వాత భూ కేటాయింపును తిరస్కరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మరోసారి సీఎం చంద్రబాబుకు విన్నవించాను. ఇప్పుడు బోర్డు తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రభుత్వానికి వచ్చింది.


దానిని ఆమోదించాలా, తిరస్కరించాలా అనేది ప్రభుత్వ నిర్ణయం. ఇదంతా పరిపాలనా ప్రక్రియ. వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఒక పేద వర్గానికి, బడుగు బలహీనవర్గానికి చెందిన నేను నా హక్కును పరిరక్షించుకుందామని, దేవుడి సేవ చేసుకుందామన్న ఆలోచనతో అడిగితే.. కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. భూ కేటాయింపు రద్దుకు, నా రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు బోర్డులోని మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదించారు. భానుప్రకాశ్‌రెడ్డి (టీటీడీ సభ్యుడు) తప్ప మిగతా వారంతా కొండను అపవిత్రం చేసినట్లే కదా! నా వల్ల ప్రభుత్వం, బోర్డు అపనిందలు పడకూడదన్న ఉద్దేశంతో నేను రాజీనామా చేయాల్సి వచ్చింది’ అని తెలిపారు.

ధర్మారెడ్డి నిర్వాకమే..

గతంలో బాలాజీ-2 స్థలం తనకే కేటాయించారని జంగా తెలిపారు. ‘మాలాంటి వారు అక్కడ ఉండడం ధర్మారెడ్డికి ఇష్టం లేదు. ఆయన చేసిన నిర్వాకమే ఇదంతా’ అని విమర్శించారు. కొండపైన కూడా వేలం పాటలు పెట్టి రియల్‌ ఎస్టేట్‌గా తయారు చేశారని ఆరోపించారు. సీఎంకు, చైర్మన్‌కు రాసిన రాజీనామా లేఖను జంగా మీడియాకు విడుదల చేశారు.

Updated Date - Jan 10 , 2026 | 04:13 AM