Share News

TTD Board: టీటీడీ బోర్డు.. మరో అడ్డగోలు తీర్మానం..

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:17 AM

టీటీడీలో అసలేం జరుగుతోంది? సొంత నిబంధనలు, తీర్మానాలనే ఎందుకు తుంగలో తొక్కుతున్నారు. మొన్నటికి మొన్న.. ‘ఇకపై ప్రైవేటు ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీ సుకోరాదు....

TTD Board: టీటీడీ బోర్డు.. మరో అడ్డగోలు తీర్మానం..

  • టీటీడీ బోర్డు మరో అడ్డగోలు తీర్మానం

  • పాలకమండలి సభ్యుడు జంగాపై కొండంత ప్రేమ

  • కొత్త అతిథి గృహం నిర్మాణానికి స్థలం కేటాయింపు

  • (తిరుపతి - ఆంధ్రజ్యోతి)

టీటీడీలో అసలేం జరుగుతోంది? సొంత నిబంధనలు, తీర్మానాలనే ఎందుకు తుంగలో తొక్కుతున్నారు. మొన్నటికి మొన్న.. ‘ఇకపై ప్రైవేటు ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీ సుకోరాదు’ అనే నిబంధనను బుట్టదాఖలు చేశారు. టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడి ఊరిలోని ఆలయా న్ని టేకోవర్‌ చేశారు. ఇప్పుడు... ‘తిరుమలలో కొత్తగా అతిథి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించరాదు’ అనే తీర్మానాన్ని పక్కన పెట్టేశారు. నిబంధనలనూ, నైతిక విలువలనూ చెత్తబుట్టలో పడేసి.. టీటీడీ బోర్డు సభ్యుడైన జంగా కృష్ణమూర్తి సూచించిన ట్రస్టుకు స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేశారు. టీడీపీ హయాంలో కొండమీద అంతా సవ్యంగా సాగుతుందని, నిబంధనలు పక్కాగా అమలవుతాయని భావిస్తున్న వారు తాజా పరిణామాలతో విస్తుపోతున్నారు.

పట్టువదలని ‘జంగా’

ఆయన పేరు జంగా కృష్ణమూర్తి! ఆయన.. కాంగ్రెస్‌ హయాం లో, ఆ తర్వాత వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. టీడీపీలో చేరి, కూటమి సర్కారులో మరోసారి టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. ఇదే కృష్ణమూర్తికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కొండమీద అతిథి గృహం నిర్మించాలన్నది ఆయన లక్ష్యం! దీనికోసం 2005 నుంచీ ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2005లో కాటేజీ డొనేషన్‌ స్కీమ్‌ కింద ఆయన వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 2005 జూలై 31న టీటీడీ బోర్డు స్థలం కేటాయించింది. అయితే, ఈ పథకం కింద అప్పటి దాకా ఉన్న రూ.10 లక్షల డొనేషన్‌ను రూ.50 లక్షలకు పెంచుతూ తీర్మానం చేసింది. అయితే,గడువులోగా డొనేషన్‌ చెల్లించకపోవడంతో 2006 జూలై 27న అప్పటి టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ జంగా పేరిట చేసిన స్థల కేటాయింపును రద్దు చేసింది. అయినా కృష్ణమూర్తి తన ప్రయత్నాలు ఆపలేదు. అందుకు అప్పటి వైఎస్‌ ప్రభుత్వం కూడా సహకరించింది. ‘ప్రత్యేక కేసు’గా పరిగణించి ఆయన పేరిట స్థలాన్ని కేటాయించాలంటూ 2008 అక్టోబరులో దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ టీటీడీ ఆయనకు స్థలం కేటాయించలేదు. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ పార్టీలోనే ఉన్న జంగా కృష్ణమూర్తి మరోసారి తన ప్రయత్నాలు ప్రారంభించారు. జంగా వినతి మేరకు తిరుమలలో స్థలం కేటాయింపును పునరుద్ధరిస్తూ 2021 డిసెంబరు 11న, అలాగే 2022 సెప్టెంబరు 24న టీటీడీ బోర్డు తీర్మానాలు చేసింది. అయితే.. అప్పటికి కాటేజీ డొనేషన్‌ స్కీమ్‌ కింద డొనేషన్‌ మొత్తం రూ.కోటికి చేరింది. ఆ మొత్తం వెంటనే చెల్లించి స్థలం స్వాధీనం చేసుకోవాలని టీటీడీ కోరగా ఆయన రూ.10 లక్షలు మాత్రమే చెల్లించారు. అది కూడా గడువు దాటిపోయాక! ఇక్కడ ఆయన ఇంకో మెలిక పెట్టారు. స్థలాన్ని తన పేరిట కాకుండా ‘ఓంశ్రీ న మో వెంకటేశాయ గ్లోబల్‌ ట్రస్టు’ పేరిట కేటాయించాలని కోరుతూ 2023 జనవరి 4న టీటీడీకి లేఖ రాశారు. అలాగే, డొనేషన్‌ చెల్లింపునకు నెల గడువు కావాలని జంగా కోరారు. ఆ గడువు కూడా దాటిపోయిన తర్వాత 2023 మార్చి 1న రూ.50 లక్షలు మాత్రమే టీటీడీకి చెల్లించారు. దీనిపై 2023 ఏప్రిల్‌ 15న జంగా కృష్ణమూర్తికి స్థల కేటాయింపును పునరుద్ధరిస్తూ ఇచ్చిన గత ఉత్తర్వులు రద్దు చేసింది. పైగా డొనేషన్‌ మొత్తాన్ని 2023 మే 20న వాపస్‌ చేసేసింది. ఇంత జరిగినా జంగా వదల్లేదు. స్థలం కేటాయించాలని కోరుతూ 2023 అక్టోబరు 19న మరోసారి టీటీడీని కోరారు. ‘కుదరదు’ అని టీటీడీ తేల్చి చెప్పింది. అంతేకాదు.. ట్రస్టు పేరిట స్థలం కేటాయించడం దేవస్థానం విధానాలకు విరుద్ధమని కూడా స్పష్టం చేసింది. ఇదంతా వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది.


ttd.jpg

ఇప్పుడు పనైపోయింది..

2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. జంగా కృష్ణమూ ర్తి టీడీపీలో చేరారు. మూడోసారి బోర్డు సభ్యుడు అయ్యా రు. మరోసారి ‘స్థల కేటాయింపు’ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తిరుమలలో అతిథిగృహం నిర్మాణానికి తను సూచిస్తున్న ట్రస్టుకు స్థలం కేటాయించాలంటూ 2025 జూన్‌లో టీటీడీని కోరారు. అనేక మంది అభ్యర్థనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన టీటీడీ జంగా పట్ల ప్రేమ చూపించింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి పంపుతూ 2025 జూలై 22న జరిగిన పాలకమండలి సమావేశంలో తీర్మానించింది. అయితే... ‘స్థలం ఇవ్వాలనుకుంటున్నారా... వద్దనుకుంటున్నారా! మీ సిఫారసు ఏమిటో స్పష్టంగా చెప్పండి’ అని 2025 సెప్టెంబరు 18న దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీకి లేఖ రాశారు. ఇక... 2025 అక్టోబరు 28న బోర్డు సమావేశమై, తిరుమలలో స్థలాల కేటాయింపు విషయం లో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని చెబుతూనే జంగా కోరిన మేరకు ఓం శ్రీ నమో వెంకటేశాయ ట్రస్టు పేరిట స్థలం కేటాయిస్తూ తీర్మానం ఆమోదించి ప్రభుత్వానికి పంపింది.

నైతికత... నియమాలు... లేవా?

  • ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం... తిరుమలలో కొత్తగా అతిథి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం కుదరదు. అయితే... పాతవైపోయిన అతిథి గృహాల స్థానంలో, అక్కడే పునరుద్ధరణకు మాత్రం ‘వేలం’ ద్వారా అవకాశమిస్తారు. అంటే.. టీటీడీకి అత్యధిక విరాళం చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి రెనొవేషన్‌ అవకాశం లభిస్తుంది.

  • జంగా సూచించిన ట్రస్టుకు నిబంధనలకు విరుద్ధంగా... తిరుమల బాలాజీనగర్‌లోని రెండో ప్లాటును కేటాయించారు. అదే స్థలానికి ఇపుడు వేలం వేస్తే రూ.15 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకూ చెల్లించేందుకు అనేకమంది దాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ... జంగా కృష్ణమూర్తి కోరిక మేరకు రూ.కోటికే ఆ స్థలం కట్టబెట్టారు.

  • జూ టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తనకు లబ్ధి కలిగే పనులను ప్రతిపాదించడం, దానికి అనుకూలంగా తీర్మానాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అలా చేస్తే వారి సభ్యత్వం సైతం రద్దయ్యే అవకాశముంది. ఈ నిబంధనను కూడా జంగా కృష్ణమూర్తి పట్టించుకోలేదు.

  • టీటీడీ ఆస్తులు, స్థలాలు, భూములపై కీలక నిర్ణయం తీసుకునే ఎస్టేట్స్‌ కమిటీలో జంగా సభ్యుడిగా పనిచేశారు. ఆ హోదాలో ఆయన తన సొంత ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. అంటే... ఆయన టీటీడీ నిబంధనలతోపాటు నైతిక నియమాలనూ ఉల్లంఘించారు.


ఎవరిది ఆ ట్రస్టు??

తిరుమలలో అతిథి గృహ నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ టీటీడీ రెండుసార్లు ఇచ్చిన అవకాశాన్ని జంగా కృష్ణమూర్తి సద్వినియోగం చేసుకోలేదు. ఇక... మరో రెండుసార్లు టీటీడీ ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘ట్రస్టు పేరిట స్థల కేటాయింపు కుదరదు’ అని వైసీపీ హయాంలోనే టీటీడీ బోర్డు తేల్చి చెప్పింది. ఇప్పుడు... కూటమి సర్కారు హయాంలో ఆయన అనుకున్నది సాధించారు. ‘ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్‌ ట్ర స్టు’ వివరాలేవీ తెలియడంలేదు. ఆ ట్రస్టు కార్యకలాపా ల గురించీ ఎవరికీ తెలియదు. వెరసి... కేవలం కొండమీద స్థలం పొందేందుకే దీనిని సృష్టించారని తెలుస్తోంది. తనకు కాకుండా ట్రస్టు పేరిట స్థలం కేటాయించేలా తెరవెనుక చక్రం తిప్పారు. దీనివెనుక బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రత్యేక ఆసక్తి కనబరిచారనే అనుమానాలూ ఉన్నాయి. 2025 అక్టోబరు 28న ఈ అంశం బోర్డు ముందుకు వచ్చేదాకా చాలామంది సభ్యులకు తెలియదు. బీజేపీ నేత భానుప్రకాశ్‌ రెడ్డి ఒక్కరే స్థల కేటాయింపును అడ్డుకునేందుకు యత్నించారు. స్థల కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదించారు. మిగిలిన వాళ్లు మౌనంగా ఉండిపోయారు.

అచ్చం అలాగే

ప్రైవేటు ఆలయాలను టేకోవర్‌ చేసుకోకూడదంటూ చేసిన తీర్మానాలు, ఈ విషయంలో తలెత్తే పరిపాలన, న్యాయపరమైన, ఇతర సమస్యలన్నీ తీర్మానంలో ప్రస్తావిస్తూనే... యనమల రామకృష్ణుడుకు చెందిన ఆలయాన్ని టీటీడీ బోర్డు టేకోవర్‌ చేసేసుకుంది. జంగాకు స్థలం కేటాయింపులోనూ అదే జరిగింది. తిరుమలను ‘కాం క్రీట్‌ జంగిల్‌’ చేయకూడదన్న హైకోర్టు ఉత్తర్వులు... పేర్కొంటూనే ‘ప్రత్యేక కేసు’గా పేర్కొంటూ జంగా కృష్ణమూర్తి సూచించిన ట్రస్టుకు స్థలం కట్టబెట్టారు.

ఇంత అడ్డగోలుగానా?

తిరుమలలో అతిథి గృహాల నిర్మానానికి కొత్తగా స్థలాలు కేటాయించరాదంటూ 2006లో టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. కొత్త నిర్మాణాల పట్ల కఠిన వైఖరి తీసుకోవాలని హైకోర్టు కూడా పలు సందర్భాలలో వ్యాఖ్యానించింది. ఎన్నో ప్రసిద్ధ సంస్థలు, ఎందరో పారిశ్రామిక వేత్తలు అభ్యర్థించినా ‘కుదరదు’ అని సూ టిగా చెప్పేస్తున్నారు. తమ శాఖల తరఫున అతిథి గృ హాలు నిర్మించుకోవడానికి స్థలం కేటాయించాలని డి ప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, రెవెన్యూ మంత్రి అనగా ని సత్యప్రసాద్‌లు కోరినా టీటీడీ ‘నో’ చెప్పింది. అలాంటిది... జంగా కృష్ణమూర్తికి మాత్రం ‘ఎస్‌’ చెప్పేసింది.

Updated Date - Jan 07 , 2026 | 07:18 AM