Share News

జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణకు విశేష స్పందన

ABN , Publish Date - Jul 06 , 2026 | 06:09 AM

జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ముగిసింది. జనసేన పార్టీ నిర్మాణ సారథుల కమిటీలు ఏడు రోజులుగా...

జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణకు విశేష స్పందన

  • రాష్ట్రవ్యాప్తంగా 35వేల దరఖాస్తులు

అమరావతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ముగిసింది. జనసేన పార్టీ నిర్మాణ సారథుల కమిటీలు ఏడు రోజులుగా... పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తిగా ఉన్న నాయకులు, సాధకులు, జనసైనికుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో గతనెల 25న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏడు రోజులపాటు కొనసాగి ఆదివారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ మాట్లాడుతూ... రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించి, పార్టీ నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టిన ఘనత జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు దక్కుతుందన్నారు. జనసేన పార్టీలోని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పదవులకు సంబంధించి సమాచార సేకరణ అనే గొప్ప ప్రక్రియ ఇదన్నారు. జెన్‌జీ ఆలోచనలకు దగ్గరగా, పారదర్శకంగా పార్టీని బలోపేతం చేసే క్రతువులో ఆదివారం నాటికి భారీస్థాయిలో దరఖాస్తులు వచ్చాయన్నారు. యువత భారీగా స్పందించి పార్టీ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారు, పార్టీ ఉన్నతికి ఆలోచించే ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలనే తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వచ్చిన దరఖాస్తులను పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ జాగ్రత్తగా పరిశీలించి, అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు.

Updated Date - Jul 06 , 2026 | 06:11 AM