Share News

అరకు పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ!

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:34 AM

అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, స్థానిక సంస్థల్లో పోటీకి జనసేన సన్నద్ధమవుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు.

అరకు పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ!

  • స్థానిక సంస్థలన్నిటిలోనూ సిద్ధం: నాగబాబు

అరకులోయ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, స్థానిక సంస్థల్లో పోటీకి జనసేన సన్నద్ధమవుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశాన్ని సోమవారం ఆయన మండలంలోని బెంజిపూర్‌ సమీపంలో ఓ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తొలుత పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. అవకాశం మేరకు అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అన్ని చోట్లా పోటీ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించారు. అందుకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గిరిజన ప్రాంత సమస్యలు, అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఉన్నంత అవగాహన, శ్రద్ధ మరొకరికి లేవన్నారు. బాక్సైట్‌ తవ్వకాలపై మీ వైఖరి ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. ప్రకృతికి విఘాతం కలిగే పనులు చేపట్టేందుకు పవన్‌కల్యాణ్‌ అంగీకరించరని నాగబాబు బదులిచ్చారు.

Updated Date - Jun 30 , 2026 | 05:35 AM