స్థానికంగానే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:04 AM
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్రస్థాయి వేడుకలు రద్దయ్యాయి.
రాష్ట్ర స్థాయి వేడుకలు రద్దు చేసిన పార్టీ అధినేత
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్రస్థాయి వేడుకలు రద్దయ్యాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దుచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా, నగర, మండల స్థాయిల్లో ఎక్కడిక్కడ నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. మార్చి 14వ తేదీ జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులకు పండగ లాంటి రోజని, ఈ దఫా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా, నగర, మండల స్థాయిల్లో ఘనంగా నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని పవన్ పిలుపునిచ్చారు. ఆ రోజున రక్తదాన శిబిరాలు, అన్నదానం, పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వాస్తవానికి ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ వేడుకలను రాష్ట్రస్థాయిలో పిఠాపురంలో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయనే నివేదిక ఆధారంగా ఆ కార్యక్రమంలో మార్పులు చేశారు.
17 వరకూ జనసేన సభ్యత్వ నమోదు
ఫిబ్రవరి 26న మొదలైన జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోందని ఆ పార్టీ ప్రకటించింది. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ సభ్యత్వ నమోదు జరుగుతోందని పేర్కొంది. ప్రవాస భారతీయులు సైతం ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వం తీసుకొంటున్నారని తెలిపింది. ఈ క్రమంలో సభ్యత్వ నమోదు గడువును ఈ నెల 17 వరకూ పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిపింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీతో ఈ కార్యక్రమం ముగిసింది. అయితే గడువు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు, ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమాన్ని మరో ఏడు రోజులపాటు పొడిగించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారని వెల్లడించింది.