Share News

జనసేన కమిటీ ముందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:55 AM

ఓ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి.. జనసేన నియమించిన విచారణ కమిటీ తమ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను మంగళవారం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో విచారించింది.

జనసేన కమిటీ ముందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌

  • లైంగిక ఆరోపణలపై 2 విడతలుగా విచారణ

  • చట్టపరంగా పోరాడతా : ఎమ్మెల్యే

తిరుపతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఓ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి.. జనసేన నియమించిన విచారణ కమిటీ తమ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను మంగళవారం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో విచారించింది. 45 మంది పార్టీ కార్యకర్తలను కూడా పిలిపించి వివరాలు సేకరించింది. రైల్వే కోడూరు గ్రామ పంచాయతీ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ ఇసకపట్ల హర్షవీణ ఇటీవల ఎమ్మెల్యే శ్రీధర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన జనసేన ఎమ్మెల్యే కావడంతో తక్షణమే స్పందించిన ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమించారు. ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ చైర్మన్‌ శివశంకర్‌, తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన నేత సొక్కం రమాదేవి, అనంతపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ టీసీ వరుణ్‌తో కూడిన కమిటీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్వేకోడూరు చేరుకుంది. తొలుత ఎమ్మెల్యేను విచారించింది. తర్వాత జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రను, 45 మంది కార్యకర్తలను విచారించింది. మెజారిటీ కార్యకర్తలు ఎమ్మెల్యేపై ఆరోపణల సంగతి పక్కనపెట్టి.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగాలేదని తెలిపినట్టు సమాచారం. సాయంత్రం 5.30 గంటల సమయంలో కమిటీ సభ్యులు మరో విడత ఎమ్మెల్యే శ్రీధర్‌ను పిలిచి విచారించారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని..దానిపై నివేదిక రూపొందించి అధిష్ఠానానికి అందజేస్తామని టీసీ వరుణ్‌ మీడియాకు చెప్పారు. మహిళా ఉద్యోగి ఆరోపణలు తన వ్యక్తిగత సమస్య అని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని శ్రీధర్‌ మీడియాకు తెలిపారు. చట్టపరంగా పోరాడతానని తెలిపారు. కాగా, అరవ శ్రీధర్‌పై రైల్వేకోడూరు పోలీసులు కేసు నమోదుచేశారు.


బొలిశెట్టి రాజీనామా

జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. జల బిరాదరి జాతీయ కన్వీనర్‌గా ఉన్న తాను.. ఉత్తరాంధ్రలోని కాలుష్య సమస్యలపై 2020లో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశానని.. ఇప్పుడు అదే పర్యావరణ శాఖకు పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ఉండడం వల్ల నైతిక ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో రాజీనామా చేశానని చెప్పారు.

Updated Date - Feb 04 , 2026 | 04:56 AM