జనసేన సమావేశం రసాభాస
ABN , Publish Date - May 12 , 2026 | 05:26 AM
ఒంగోలులో సోమవారం నిర్వహించిన జనసేన పార్టీ ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశం రసాభాసగా సాగింది.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతల రగడ
రియాజ్, రవిశంకర్ గైర్హాజరు
ఒంగోలు కలెక్టరేట్, మే 11(ఆంధ్రజ్యోతి): ఒంగోలులో సోమవారం నిర్వహించిన జనసేన పార్టీ ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశం రసాభాసగా సాగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల బాధ్యుల తీరుకు నిరసనగా ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లాకు చెందిన టిడ్కో రాష్ట్ర చైర్మన్ అజయ్‌కు వ్యతిరేకంగా ఆజిల్లా నాయకులు నిరసన తెలిపారు. ఆజయ్ వేదికపైకి ఎక్కరాదంటూ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు సుజయ్ వర్గం వారు కొద్దిసేపు ఆందోళన చేసి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి మాజీ ఇన్‌చార్జి కంచర్ల శ్రీకృష్ణ, వైపాలెం ఇన్‌చార్జి గౌతమ్‌రాజులను వేదిక మీదకు ఆహ్వానించడంపై ఆ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు రభస చేశారు. గత ఎన్నికల సమయంలో వైసీపీకి అమ్ముడుపోయిన వారిని ఏవిధంగా వేదిక మీదకు ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. ఇటువంటి నాయకుల వల్ల పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందని మండిపడ్డారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొని వారితో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే రాత పూర్వకంగా ఇవ్వాలని సూచించారు. సమావేశం అనంతరం నియోజకవర్గాల వారీగా సమీక్షించే సమయంలో ఆయా అంశాలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, ఆపార్టీ నాయకుడు కంది రవిశంకర్ సమావేశానికి గైర్హాజరయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి రియాజ్ జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతోపాటు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఒంగోలులో ఆపార్టీ స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశానికి రియాజ్‌తోపాటు ఆయన అనుచరులు కూడా గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. అలాగే ఒంగోలులో జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో ఉన్న నాయకులు చాలా మంది కనిపించలేదు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, రియాజ్ వర్గం వ్యతిరేకిస్తోంది. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్‌ను ఆహ్వానించలేదని ఆయన వర్గం ఆరోపిస్తోంది. మాజీమంత్రి బాలినేని వర్గం మాత్రం సమావేశానికి రియాజ్‌ను ఆహ్వానించామని, అందుకు అవసరమైన ఆఽధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్తున్నారు. సమావేశానికి దర్శి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యనాయకులూ హాజరు కాలేదు.