జనసేనలోకి స్వాగతం..!
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:12 AM
జనసేనలో కొత్తగా చేరేవారిని సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేశామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం వెల్లడించారు.
ఏపీలో ప్రత్యేకంగా ‘జాయినింగ్స్ కమిటీ’ ఏర్పాటు
ముగ్గురు ఎమ్మెల్యేలు, కొత్త ఎంపీకి స్థానం
14 మందితో ఏర్పాటు చేసిన అధినేత పవన్ కల్యాణ్
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): జనసేనలో కొత్తగా చేరేవారిని సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేశామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజిక వేత్తలు, తటస్థులను ఈ కమిటీ సమన్వయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 14 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేశ్‌లకు చోటు కల్పించారు. వీరితో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెద్దపూడి విజయకుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టీసీ వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి... పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేయనున్నట్లు పవన్ తెలిపారు. ఏపీ తరహాలో తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అయితే జనసేన అధినాయకత్వం నియమించిన కమిటీలపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పార్టీ దాదాపు 10-15 ప్రత్యేక కమిటీలను నియమించింది. అయితే ఈ కమిటీల పేర్లు మారుతున్నాయి... తప్ప అందులో సభ్యులు మాత్రం మారడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి జాయినింగ్స్ కమిటీలో మరింత మందికి స్థానం కల్పించాలని నాయకులు ఆశిస్తున్నారు.