Share News

వైసీపీ అరాచకాలను ప్రజలకు చెబుదాం!

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:26 AM

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలు, కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియజెప్పాలని జనసేన శాసనసభా పక్షం నిర్ణయించింది.

వైసీపీ అరాచకాలను ప్రజలకు చెబుదాం!

  • లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా అత్యంత దుర్మార్గం

  • జనసేన శాసనసభాపక్షం ఆగ్రహం

  • పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో వర్చువల్‌గా భేటీ

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలు, కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియజెప్పాలని జనసేన శాసనసభా పక్షం నిర్ణయించింది. అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో నెయ్యి సరఫరా చేయడం అత్యంత దుర్మార్గమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, వారి ఆరోగ్యాలతో చెలగాటమాడడమే అవుతుందని స్పష్టం చేసింది. ఇంత అరాచకం చేసి, బుకాయింపులతో ప్రజల్ని మభ్యపెట్టే చర్యలకు వైసీపీ నేతలు దిగారని మండిపడ్డారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో జనసేన శాసనసభాపక్షం గురువారం మధ్యాహ్నం వర్చువల్‌గా జరిగింది. మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, అసెంబ్లీ, మండలి విప్‌లు బొమ్మిడి నాయకర్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, పిడుగు హరిప్రసాద్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో మొదలయ్యే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ వైఖరి, తదితర అంశాలు చర్చకు వచ్చాయి. తిరుపతి లడ్డూల విషయంలో గత ప్రభుత్వం చేసిన కల్తీ వ్యవహారంపై సభలో చర్చిద్దామని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. ఎమ్మెల్సీ కె.నాగబాబు మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ నెయ్యిపై సభలోనే గాక మీడియా, సోషల్‌ మీడియాల్లోనూ లోతుగా చర్చ చేసి, ప్రజలకు వాస్తవాలు వివరించాల్సి ఉన్నదన్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపైనా చర్చించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ తరపున త్రిసభ్య కమిటీ వేసి, నిజనిజాలు విచారించాలని ఆదేశాలివ్వడం ద్వారా పార్టీ ఎంత నిబద్ధతతో ఉంటుందో పవన్‌ కల్యాణ్‌ అందరికీ తెలియజేశారని శాసనసభాపక్షం పేర్కొంది. బడ్జెట్‌ సమావేశాలకు ముందు మరోసారి శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి మనోహర్‌ మీడియాకు తెలిపారు.

Updated Date - Jan 30 , 2026 | 05:27 AM