అమెరికా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం
ABN , Publish Date - May 26 , 2026 | 05:31 AM
శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జన సాహితి 13 వ మహాసభలు సోమవారం ముగిశాయి.
జనసాహితి ముగింపు సభలో వక్తల పిలుపు.. నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం, మే 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జన సాహితి 13 వ మహాసభలు సోమవారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా రచయితలు, కళాకారులు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, అభ్యుదయవాదులు ఈ సభలకు తరలివచ్చారు. సమకాలీన, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులపై లోతుగా చర్చించారు. అమెరికా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని, ప్రజాస్వామ్య, లౌకిక విలువలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. కార్మిక, రైతు, కూలీల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని.., స్త్రీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల హక్కుల రక్షణకు ఉద్యమించాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, మాతృభాషలోనే విద్య, పరిపాలన అందించాలని తదితర తీర్మానాలను ఆమోదించారు. అమెరికాకు వ్యతిరేకంగా శ్రీకాకుళం పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద సోమవారం ప్రదర్శన నిర్వహించారు. ముగింపు సభలో జనసాహితీ నూతన రాష్ట్ర కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా దివికుమార్, అధ్యక్షులుగా పీఎస్ నాగరాజు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ భట్టు లక్ష్మీనారాయణ, డాక్టర్ బి.అరుణ, ప్రధాన కార్యదర్శిగా ఆశ, సహాయ కార్యదర్శులుగా ఓవీవీఎస్ రామకృష్ణ, ప్రసన్న, కోశాధికారిగా వేములపల్లి రాధిక ఎన్నికయ్యారు.