Share News

నేడు ఢిల్లీలో ‘సేన ప్రస్థానం’ సమావేశం

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:25 AM

జాతీయ సమగ్రత దృక్పథంతో ‘సేన ప్రస్థానం-జాతీయ సమైక్యత కోసం..’ అనే విధానంపై జనసేన సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది.

నేడు ఢిల్లీలో ‘సేన ప్రస్థానం’ సమావేశం

  • జాతీయ సమైక్యతపై పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రసంగం

  • హాజరుకానున్న పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు

అమరావతి/న్యూఢిల్లీ, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): జాతీయ సమగ్రత దృక్పథంతో ‘సేన ప్రస్థానం-జాతీయ సమైక్యత కోసం..’ అనే విధానంపై జనసేన సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. జనసేన పన్నెండేళ్ల ప్రస్థానం, జాతీయ సమైక్యత కోసం ఆ పార్టీ చేస్తున్న కృషిపై చర్చించనున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఏపీ ముఖ్య నేతలతో పాటు తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి ఇటీవల పార్టీలో చేరిన సభ్యులు హాజరవుతారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం వంటి సిద్ధాంతాలను పాటించే పార్టీగా ఈ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. గత పుష్కర కాలంగా జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, జాతీయ సమైక్యతపై పార్టీ ఎలాంటి భావజాలంతో పనిచేస్తుందో పవన్‌ కల్యాణ్‌ వివరించనున్నారని పేర్కొంది. జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశంలో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా ఎలా నిలబడాలి? వర్తమాన పరిస్థితుల్లో సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతో పాటు జాతీయ రాజకీయాలపై నాయకులకు పవన్‌ దిశానిర్దేశం చేస్తారని వెల్లడించింది. కాగా, ఈ సమావేశం ప్రారంభానికి ముందు పవన్‌ కల్యాణ్‌ జాతీయ యుద్ధస్మృతి స్థలంలో అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.

Updated Date - Jun 15 , 2026 | 04:26 AM