సోషల్ మీడియాలో వీడియోలపై హైకోర్టుకు అరవ
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:45 AM
టీవీలు, డిజిటల్, సోషల్ మీడియాలో తన ప్రతిష్ఠ దెబ్బతీసేలా సర్క్యులేట్ అవుతున్న తన ప్రైవేట్ వీడియోలు, ఫొటోలతో పాటు సంబంధిత కంటెంట్‌ను తొలగించేలా...
వాటిని తొలగించేలా ఆదేశాలివ్వాలని శ్రీధర్ పిటిషన్
వివరాలు సమర్పించాలని పోలీసులకు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): టీవీలు, డిజిటల్, సోషల్ మీడియాలో తన ప్రతిష్ఠ దెబ్బతీసేలా సర్క్యులేట్ అవుతున్న తన ప్రైవేట్ వీడియోలు, ఫొటోలతో పాటు సంబంధిత కంటెంట్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హర్షవీణ అనే మహిళ ఇచ్చిన కంటెంట్‌ను భవిష్యత్తులో తిరిగి అప్‌లోడ్ చేయకుండా, ప్రసారం చేయకుండా నిరోధించాలని కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా అరవ శ్రీధర్ తరఫున న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ గోప్యత హక్కును హరిస్తున్నారని వాదించారు. శ్రీధర్‌కు సంబంధించిన ప్రైవేటు వీడియోలను ప్రసారం చేయకుండా నిరోధించాలని కోరారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని రైల్వేకోడూరు పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేశారు.