26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:53 AM
జనసేన సభ్యత్వ నమోదు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మార్చి 10 వరకు కార్యక్రమం: మంత్రి మనోహర్
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జనసేన సభ్యత్వ నమోదు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జులతో గురువారం సాయంత్రం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదుతో అన్ని వర్గాల వారినీ, అన్ని రంగాల వారినీ కలుసుకుని పార్టీకి దగ్గర చేసే గొప్ప అవకాశం ఈ నెల 26 నుంచి మార్చి 10వరకు కలుగుతుందన్నారు. దీనిద్వారా పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని చాటిచెబుదామని, స్థానిక ఎన్నికలకు సభ్యత్వ నమోదును సన్నద్ధతగా భావిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో గురువారం లాంఛనంగా ప్రారంభమైందన్నారు. ‘2020లో 5 నియోజకవర్గాల్లో ఫైలెట్ విధానంలో మొదలుపెట్టిన కార్యక్రమం.. గతేడాది 12.18 లక్షలకు చేరింది. మొదటి ఏడాది 94 వేల మంది చేరితే అది ప్రతి ఏటా పెరుగుతూ వెళ్లింది. కరోనా సమయంలోనూ 3.30 లక్షల మందిని సభ్యులుగా చేర్చాం. ప్రతి నియోజకవర్గం నుంచి 75 నుంచి 100 మంది సాధక్‌ల పేర్లను సత్వరమే అందజేయాలి. ఉద్యమి సభ్యత్వం తీసుకున్నవారు రూ.400 చెల్లించాలి. వీరికి ప్రమాద బీమా ప్రయోజనాలు అందుతాయి. అలాగే పార్టీకి పరోక్షంగా సహాయసహకారాలు అందించే వారిని ప్రదాత అని పిలుస్తాం. సాధక్‌లకు అందుబాటులో ఉండేలా.. ప్రత్యేక కాల్ సెంటర్ ఈ రెండు వారాలూ పనిచేస్తుంది. జెన్ జీ తరం సరికొత్తగా ఆలోచిస్తోంది. వారిని పార్టీకి దగ్గర చేయాలి. సభ్యత్వ నమోదును పరిశీలించేందుకు, సమన్వయపరచేందుకు రెండ్రోజుల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి పరిశీలకులను నియమిస్తాం. ఇతర రాష్ర్టాల్లోనూ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి కోసం వెబ్‌సైట్‌లోనూ నమోదు చేసుకునే ఆప్షన్ కల్పించాం. సభ్యత్వ నమోదును రెండు వారాలు ఊరూ వాడా పండుగలా నిర్వహిద్దాం’ అని మనోహర్ అన్నారు.