Share News

జామ.. అధరహో

ABN , Publish Date - Mar 01 , 2026 | 10:55 PM

జామ ధరలు వారం రోజులుగా పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం 25 కిలోల బాక్సు రూ.250 ఉండగా ప్రస్తుతం రూ.700కు పెరిగింది. దీంతో రైతులు ఆనందంలో ఉన్నారు.

   జామ.. అధరహో
చక్రవర్తులపల్లెలో సాగు చేసిన తైవాన జామ

జిల్లాలో 400 హెక్టార్లలో సాగు

25 కిలోల బాక్సు రూ.700

చాగలమర్రి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జామ ధరలు వారం రోజులుగా పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం 25 కిలోల బాక్సు రూ.250 ఉండగా ప్రస్తుతం రూ.700కు పెరిగింది. దీంతో రైతులు ఆనందంలో ఉన్నారు. గత సీజనలో జామ రైతులు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దిగుబడి, ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో సతమతమయ్యారు. పండు ఈగ దాడితో చేతికొచ్చిన జామకాయలు దెబ్బతిని నష్టపోయారు. కానీ ఈ ఏడాది ధరలు పెరగడంతో కోతకు వచ్చిన జామకాయలతో రైతులకు ఊరటనిచ్చింది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 400 హెక్టార్లలో జామ సాగు అవుతోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో 300 ఎకరాల్లో తైవాన బింక్‌, తైవానరెడ్‌, వీఎనఆర్‌ రకాలను రైతులు సాగు చేస్తున్నారు. చాగలమర్రి మండలంలో చక్రవర్తులపల్లె, ముత్యాలపాడు, గొడిగనూరు, శెట్టివీడు గ్రామాల్లో 60 ఎకరాల్లో జామ తోటలను సాగు చేశారు. ఇప్పటి వరకు ఎకరాకు రూ.70 వేలు వరకు పెట్టుబడి పెట్టారు. గత ఏడాది వైరస్‌ కారణంగా దిగుబడులు తగ్గి సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం ఎకరాకు 20 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 3 టన్నులు మాత్రమే వచ్చింది. ఈ ఏడాది 14 టన్నుల మేర దిగుబడి రావడంతో రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు.

ఫ సిరులు కురిపిస్తున్న జామ

జామ పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ఎకరాకు 14 టన్నుల దిగుబడి వస్తోంది. ఈ లెక్కన 600 బాక్సుల వరకు దిగుబడి రావడంతో ఆదాయం పెరిగింది. ధర కూడా రూ.200 నుంచి రూ.700కు పెరిగింది. ఖర్చులు పోయి సుమారు రైతులకు రూ.2 లక్షల దాక ఆదాయం వస్తోంది. దీంతో గత ఏడాది జరిగిన నష్టాన్ని పూడ్చుకొని గట్టెక్కామని రైతులు చెబుతున్నారు.

ఫ ప్లాస్టిక్‌ కవర్లతో..

సాధారణంగా జామసాగులో ‘పండుఈగ’ ప్రధాన సమస్యగా మారుతోంది. కానీ ఈ ఏడాది రైతులు సాగులో మొదటి నుంచి అప్రమత్తమై పంటను కాపాడుకున్నారు. జామకాయను పండుఈగ తినకుండా ప్లాస్టిక్‌ కవర్లు తొడిగారు. ఎకరాకు 200 బాక్సుల కవర్లు కొనుగోలు చేసి జామకాయలను పురుగు తినకుండా కాపాడుకోగలిగారు. పండుఈగ నివారణ కోసం రైతులే తమ సొంత ఆలోచనలతో రూ.150 విలువ చేసే ప్లాస్టిక్‌ బుట్టలను కొనుగోలు చేసుకొని జామ చెట్ల వద్ద ఉంచుతున్నారు. దీంతో పండు ఈగతో పాటు వివిధ పక్షులు తినకుండా రక్షణ కవచంలా నిలిచాయి. చక్రవర్తులపల్లెకు చెందిన రవీంద్రారెడ్డి అనే రైతు 4 ఎకరాల్లో జామకాయల కవర్ల కోసం ఖర్చు రూ.1.20 లక్షలు ఖర్చు చేశారు. పండుఈగ నివారణ కోసం ఎకరాకు 10 నుంచి 20 బుట్టలు ఏర్పాటు చేయడంతో ఆ బుట్టలో పండుఈగలు పడుతుండటంతో కాయలకు ఈగ బెడద తగ్గింది. ప్రస్తుతం టన్ను ధర రూ.30 వేలు పలుకుతోందని, దీంతో లాభసాటిగా మారిందని రైతు రవీంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఈగ నివారణకు బుట్టలను రాయితీ ద్వారా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 10:55 PM