జమిలి ఎన్నికలతో సమర్థవంతమైన పాలన
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:23 AM
దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగే జమిలి ఎన్నికలతో సమర్థవంతమైన పాలన సాధ్యమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అభిప్రాయపడ్డారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్
కర్నూలు అర్బన్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగే జమిలి ఎన్నికలతో సమర్థవంతమైన పాలన సాధ్యమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ యూనివర్సిటీ సెనేట్ హాలులో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘ఒకే దేశం...ఒకే ఎన్నిక’ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సుకు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తే అధిక వ్యయాన్ని అరికట్టవచ్చని, జమిలి ఎన్నికల నిర్వహణ గురించి ఆధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికలో ఈ దిశగా ఎన్నో అంశాలను చర్చించిందని తెలిపారు. ఈ విధమైన ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలో 18 సవరణలు చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ మొత్తం ఎన్నికల ప్రక్రియ 100 రోజుల్లో ముగించాలని సూచించిందన్నారు. సామాన్యులకు ఈ విధానం గురించి తెలియజేయాల్సిన బాధ్యత మేధావులపై ఉందన్నారు. సదస్సులో ఉపకులపతి వి.వెంకట బసవరావు, రెక్టార్ ఎన్ టీకే నాయక్, రిజిస్ట్రార్ బి.విజయకుమార్, డీన్ సీవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.