Share News

దేశవ్యాప్తంగా జలధార!

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:40 AM

అన్నమయ్య జిల్లాలో అమలు చేస్తున్న జలధార ప్రాజెక్టు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్టును అధ్యయనం చేసి, దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది.

దేశవ్యాప్తంగా జలధార!

  • అధ్యయనానికి త్వరలో కేంద్ర బృందం

  • అన్నమయ్య జిల్లాలో ప్రాజెక్టు విజయవంతం

  • సమర్థవంతంగా నీటి వనరుల వినియోగం

  • 8.59 మీటర్లు పెరిగిన భూగర్భ జలాలు

  • పెరిగిన వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు

  • రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సీఎం నిర్ణయం

  • నెలాఖరులోగా ప్రాజె క్టు పరిశీలనకు

(అన్నమయ్య-ఆంధ్రజ్యోతి)

అన్నమయ్య జిల్లాలో అమలు చేస్తున్న జలధార ప్రాజెక్టు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్టును అధ్యయనం చేసి, దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది. కేంద్రంలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులు కొందరు రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌తో మాట్లాడారు. జలధార ప్రాజెక్టును అధ్యయనం చేయడానికి వారు త్వరలోనే జిల్లాకు రానున్నారు. గతేడాది కలెక్టర్‌ కృషితో జిల్లాలో చేపట్టిన ఈ కార్యక్రమం ఎన్నో సత్ఫలితాలిచ్చింది. కరువు జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు పెరిగింది. అన్నమయ్య జిల్లా యంత్రాంగం సాధించిన ఈ అద్బుత విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. జలధార.. జలహారతి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి అత్యున్నత ఇంజనీర్ల బృందం గత నెలలో రెండు రోజులు జిల్లాలో పర్యటించి నివేదికను సీఎంకు అందించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమూ దృష్టి సారించింది.


అన్నమయ్యలో నాడు, నేడు..

కరువు జిల్లాల జాబితాలో అన్నమయ్య జిల్లా ముందు వరసలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కరువు మండలాల జాబితాలో ఈ జిల్లా నుంచే ఎక్కువగా ఉంటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 30 మండలాలకు గానూ 19 మండలాలు కరువు జాబితాలో ఉన్నాయి. 230కి పైగా పల్లెల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన పరిస్థితి. 2025-26 ఖరీ్‌ఫలో నికర సాగు దాదాపు 40 శాతం తగ్గింది. 40,370 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా, 16,148 హెక్టార్లలో మాత్రమే సాగైంది. అయితే గతేడాది ఆగస్టు నుంచి డిసెంబరు నాటికి జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు పెరిగింది. పాడి పరిశ్రమ కూడా పెరిగింది. దీనంతటికి కారణం జలధార ప్రాజెక్టు. జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను సమర్థవంతంగా వాడుకుంది. అదనంగా ఉన్న నీరు వృథా కాకుండా లోటు ప్రాంతాలకు తరలించింది. ఫలితంగా కేవలం ఆరు నెలల్లో జిల్లాలో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో రోజూ 20 వేల నుంచి 30 వేల మంది కూలీలు అందుబాటులో ఉండటంతో చెరువుల పునరుద్ధరణ, ఫీడర్‌ కాలువలను శుభ్రపరిచే పనులను కలెక్టర్‌ చేపట్టారు. చిన్నచిన్న కాలువలను అనుసంధానం చేసి, ప్రతి వాన చినుకునూ నిల్వ చేయగలిగారు. 532 చిన్న జలపాతాల ద్వారా 3082 చెరువులను అనుసంధానం చేశారు. 962 ఎండిపోయిన చెరువులను పునరుద్ధరించారు. దీంతో జిల్లాలో 2025 ఆగస్టు నుంచి డిసెంబరు నాటికి 8.59 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయి. ఎండిపోయిన 20 వేల బోర్లలో మళ్లీ నీళ్లు వస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గి రూ.96 కోట్ల విద్యుత్‌ ఖర్చు అదా అయింది. ప్రతి చెరువూ 25 నుంచి 50 శాతం నీటితో ఉన్నాయి. తద్వారా ఉద్యాన పంటల సాగు 20 వేల హెక్టార్లు ఆదనంగా పెరిగింది. ఐదు లక్షల ఎకరాలలో పశుగ్రాసం అందుబాటులోకి వచ్చింది. రోజుకు అదనంగా లక్ష లీటర్ల పాల ఉత్పత్తి పెరిగింది.


జలధార పరిశీలనకు సీఎం

జలధార ప్రాజెక్టును పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు నెలాఖరులోగా అన్నమయ్య జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 12 , 2026 | 04:41 AM