Share News

జల్‌, జంగిల్‌, జమీన్‌ కోసమే ఉద్యమం

ABN , Publish Date - May 24 , 2026 | 05:01 AM

ఆదివాసీ హక్కుల నినాదమైన నీరు, అటవీ, భూమి (జల్‌, జంగిల్‌, జమీన్‌) కోసం ఉద్యమాలు నిర్మిస్తామని, ఎట్టి పరిస్ధితులలో వాటిని వదలబోమని ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ ఉద్యమకారిణి సోనీ సోరీ స్పష్టం చేశారు.

జల్‌, జంగిల్‌, జమీన్‌ కోసమే ఉద్యమం

  • ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ ఉద్యమకారిణి సోనీ సోరీ

గుంటూరు(తూర్పు), మే 23 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ హక్కుల నినాదమైన నీరు, అటవీ, భూమి (జల్‌, జంగిల్‌, జమీన్‌) కోసం ఉద్యమాలు నిర్మిస్తామని, ఎట్టి పరిస్ధితులలో వాటిని వదలబోమని ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ ఉద్యమకారిణి సోనీ సోరీ స్పష్టం చేశారు. గుంటూరు రెవెన్యూ కల్యాణ మండపంలో శనివారం ప్రగతిశీల మహిళా సంఘ (పీవోడబ్ల్యూ) 9 రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. సోనీ సోరీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై సాగిస్తున్న దారుణ మారణకాండలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తాను ముగ్గురు పిల్లల తల్లిగా, ఉపాధ్యాయినిగా పాఠాలు చెప్పే క్రమంలో ఆదివాసీలు తమ సమస్యలపై పోరాటాలు చేస్తున్న సందర్భంలో వాటికి మద్దతు పలికినందుకు జరిగిన దాడులను, తాను, తన కుటుంబం అనుభవించిన హింసను వివరించారు. మరో వక్త, కవయిత్రి మౌమిత ఆలం మాట్లాడుతూ, ప్రపంచ వనరులపై ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు. మహాసభలకు అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, ప్రధాన కార్యదర్శి పద్మ, ఉపాధ్యక్షురాలు రమా సుందరి, గంగాభవాని, విష్ణు అధ్యక్షత వహించారు. పీవోడబ్ల్యూ జాతీయ నాయకులు ఝాన్సీ, సంధ్య, ఢిల్లీ నాయకులు పూనమ్‌, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి మంగ ప్రసంగించారు.

Updated Date - May 24 , 2026 | 05:02 AM