Share News

ఆ ప్రాణం ‘విలువ’ రూ.262 కోట్లు!

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:08 AM

అబ్బే... ఈ ప్రాణానికి పెద్దగా విలువేమీ లేదు. 11వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’... మూడేళ్ల కిందట కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి దుర్మరణంపై ఒక పోలీసు అధికారి చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలివి....

ఆ ప్రాణం ‘విలువ’ రూ.262 కోట్లు!

  • జాహ్నవి కుటుంబానికి పరిహారం

  • కుటుంబ సభ్యులతో ఒప్పందం!

  • మాస్టర్స్‌ చేసేందుకు అమెరికాకు జాహ్నవి

  • రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ

  • ‘విలువలేని ప్రాణం’ అంటూ అధికారి ఎగతాళి

  • భారత దౌత్యాధికారుల జోక్యంతో లోతుగా దర్యాప్తు

  • అప్పట్లో ఇద్దరు పోలీసు అధికారుల సస్పెన్షన్‌

  • భారీ పరిహారానికి సిద్ధమైన సియాటెల్‌ యంత్రాంగం

సియాటెల్‌, ఫిబ్రవరి 12: ‘అబ్బే... ఈ ప్రాణానికి పెద్దగా విలువేమీ లేదు. 11వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’... మూడేళ్ల కిందట కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి దుర్మరణంపై ఒక పోలీసు అధికారి చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలివి! 2023లో అమెరికాలోని సియాటెల్‌లో ఈ దారుణం జరిగింది. ఇప్పుడు... అదే సియాటెల్‌ యంత్రాంగం జాహ్నవి కుటుంబానికి 2.9 కోట్ల డాలర్లు, అంటే మన కరెన్సీలో దాదాపు 262 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులతో ఒప్పందానికి వచ్చినట్లు సియాటెల్‌ సిటీ అటార్నీ ఎరికా ఎవాన్స్‌ బుధవారం ప్రకటించారు. ‘‘జాహ్నవి మరణం మా గుండెలను కలచివేసింది. ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కొంతైనా ఊరట కలుగుతుందని భావిస్తున్నాం’’ అని తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి(23) 2021లో నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ సియాటిల్‌ క్యాంప్‌సలో మాస్టర్స్‌ డిగ్రీలో చేరారు. 2023 జనవరి 23వ తేదీన జాహ్నవి రోడ్డు దాటుతుండగా... అతి వేగంగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఆమెను ఢీకొట్టింది. గంటకు గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సిన రహదారిపై... కెవిన్‌ డవే అనే పోలీసు అధికారి 119 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చాడు. ఆ సమయంలో అతను ‘డ్రగ్స్‌’ మత్తులో ఉన్నట్లు తేలింది. పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టగానే జాహ్నవి దాదాపు వంద అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. అక్కడిక్కడే మరణించారు. ఇదే ఘోరమైతే... ఆమె మరణంపై మరో పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ చేసిన వ్యాఖ్యలు మరింత ఘోరం! ‘ఆమె సాధారణ యువతి.


ఆ మరణానికి విలువ లేదు. ఒక చెక్‌తో సెటిల్‌ అయిపోతుంది’ అంటూ పెద్దగా నవ్వుతూ జోకులు వేశాడు. బాడీ క్యామ్‌లో ఆయన మాటలు రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్‌ కావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అమెరికాలోని భారతీయులు తీవ్రంగా స్పందించారు. నిరసన ప్రదర్శనలూ జరిగాయి. భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని.. లోతుగా దర్యాప్తు జరిపించాలని కోరడంతో కెవిన్‌ డవేతో పాటు డేనియల్‌ అడెరెర్‌ను కూడా అమెరికా ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు డవేకు ఐదు వేల డాలర్ల (రూ.4.52 లక్షలు) జరిమానా విధించింది. అయితే, డవే కావాలనే నిబంధనలను నిర్లక్ష్యం చేసినట్టు నిరూపించే సాక్ష్యాధారాలు లభించలేదని ఈ కేసును విచారిస్తున్న కింగ్‌ కౌంటీ కోర్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు. అందువల్ల ఆయనపై నేరాభియోగాలు (ఫెలోనీ) మోపలేమన్నారు. జాహ్నవి ప్రాణంపై చులకన వ్యాఖ్యలు చేసిన అడెరెర్‌పై మాత్రం చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కింగ్‌ కౌంటీ న్యాయస్థానంలో గతవారం ఇరుపార్టీలు మరోసారి వాదనలు వినిపించాయి. బాధిత కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు సియాటెల్‌ అటార్నీ ఎరికా ఎవాన్స్‌ తెలిపారు.


మూడేళ్ల న్యాయ పోరాటం!

  • 2 రోజుల క్రితం జాహ్నవి తండ్రి మృతి

కందుల జాహ్నవి.. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లింది. మరో ఆరేడు నెలల్లో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకుంటుందనగా... ఒక పోలీసు అధికారి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఆమెను బలితీసుకుంది. మరో విషాదం ఏమిటంటే... మంగళవారం జాహ్నవి తండ్రి గుండెపోటుతో మరణించారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంభళనూరు క్యాంప్‌ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌, విజయలక్ష్మి దంపతులకు జాహ్నవి, హనీ ఇద్దరు కూతుళ్లు. ఆదోనిలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన జాహ్నవి మాస్టర్స్‌ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్లారు. పట్టా సాధిస్తుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న కుటుంబ సభ్యులను... జాహ్నవి దుర్మరణం కోలుకోలేని దెబ్బ తీసింది. కెవిన్‌ డవే, డేనియల్‌ అడెరెర్‌లపై సియాటెల్‌లో న్యాయపోరాటం మొదలుపెట్టారు. మూడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం... జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్లు పరిహారం చెల్లించేందుకు సియాటెల్‌ యంత్రాంగం ఒప్పందం చేసుకుంది. న్యాయపోరాటంలో విజయం సాధించిన వార్త వినకముందే... కందుల శ్రీకాంత్‌ గుండెపోటుతో చనిపోయారు. హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీకాంత్‌... మంగళవారం ఆదోనిలో ఉంటున్న భార్య విజయలక్ష్మి వద్దకు వచ్చారు. విజయవాడకు రైలు ఎక్కేందుకు గుంతకల్లు చేరుకున్నారు. అక్కడే రైల్వే స్టేషన్‌లో గుండె పోటుకు గురై మృతి చెందారని బంధువులు తెలిపారు. రూ.262 కోట్ల పరిహారంపై ఒప్పందం కుదిరినట్లు వచ్చిన వార్తలపై స్పందించేందుకు విజయలక్ష్మి నిరాకరించారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె దీనిపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.

Updated Date - Feb 13 , 2026 | 04:08 AM