‘మాజీ’ అయినా అవే తిప్పలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:15 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం విశాఖ నగరంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వాహనచోదకులు....
జగన్ పర్యటనలో విశాఖ పోలీసుల అత్యుత్సాహం
ఆయన ఎయిర్‌పోర్టులో బయలుదేరడానికి ముందే బీఆర్‌టీఎస్ రోడ్డులో వాహనాల నిలిపివేత
మండుటెండలో వాహనచోదకుల అగచాట్లు
విశాఖపట్నం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం విశాఖ నగరంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వాహనచోదకులు, ప్రయాణికులు మండుటెండలో తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. విజయవాడ నుంచి విమానంలో విశాఖ చేరుకున్న జగన్, విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో అరకులోయకు వెళ్లారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, తిరిగి హెలికాప్టర్‌లో విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో రోడ్డు మార్గంలో మర్రిపాలెంలోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే్‌షకుమార్ నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి మర్రిపాలెం వరకు బీఆర్‌టీఎస్ రోడ్డుపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. జగన్ ఎయిర్‌పోర్టులో బయలుదేరకముందే వాహనాలను ఆపేయడంతో వాహనాలు కిలోమీటరు దూరం వరకు నిలిచిపోయాయి. వాసుపల్లి నివాసానికి జగన్ చేరుకున్న తర్వాత ట్రాఫిక్‌ను వదిలినప్పటికీ తర్వాత 30 నిమిషాలకే జగన్ విమానాశ్రయానికి ప్రయాణమవడంతో మరోసారి మర్రిపాలెం నుంచి ఎన్‌ఏడీ వరకు బీఆర్‌టీఎస్ రోడ్డులో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. మాజీ సీఎం వస్తే గంటల తరబడి వాహనాలను ఆపేయడం ఏమిటంటూ పోలీసులపై వాహనచోదకులు మండిపడ్డారు. అత్యుత్సాహం ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.