కల్తీ నెయ్యిలో జగన్ జైలుకే.. వదిలే ప్రసక్తే లేదు
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:17 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి లడ్డూలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో జగన్‌ను కచ్చితంగా జైలుకు పంపుతామని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు సభ్యుడు...
మా వద్ద సిట్ దర్యాప్తును మించిన ఆధారాలు.. వాటితో సుప్రీంలో అప్పీల్
రూ.251 కోట్లకు కక్కుర్తిపడి నెయ్యి లేకుండా అపవిత్ర ప్రసాదాలు
వైవీ, ధర్మారెడ్డి, భూమనదీ కీలక పాత్రే: టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ
కాకినాడ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరుడి లడ్డూలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో జగన్‌ను కచ్చితంగా జైలుకు పంపుతామని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు సభ్యుడు, జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టంచేశారు. ఈ కేసులో ఆయన్ను వదిలేది లేదని స్పష్టంచేశారు. ఖబడ్దార్ జగన్ అంటూ హెచ్చరించారు. కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఆయన హయాంలో తిరుమలలో నెయ్యి అనే పదార్థం లేకుండానే లడ్డూ ప్రసాదాలు చేయించి అపవిత్రం చేశారు. రూ.251 కోట్లకు కక్కుర్తిపడి కల్తీ నెయ్యి వాడారు. ఇందులో వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్‌లతోపాటు భూమన కరుణాకరరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఒక విషపదార్థాన్ని తెచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. వేంకటేశ్వరస్వామి భక్తులను మోసం చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా చెబుతున్నా.. జగన్‌పై సిట్ దర్యాప్తును మించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. వాటితో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నాం. జగన్‌ను కచ్చితంగా జైలుకు పంపుతాం. ఈ నికృష్ట పనితో ఆయన పరువుప్రతిష్ఠలు మంట కలిశాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంతో, ఇంతో కష్టపడి ప్రజల్లో సంపాదించుకున్న చిన్నస్థానం నేడు జగన్ తీరుతో సమూలంగా కూలిపోయింది’ అని వ్యాఖ్యానించారు.
కాపు సోదరుల్లారా.. తస్మాత్ జాగ్రత్త!
అంబటి రాంబాబు తోలుబొమ్మ అని, వెనుక ఉండి ఆడించేవారు చెప్పినట్లుగా ఆడతాడని నెహ్రూ మండిపడ్డారు. ‘అంబటిని వెనకుండి నడిపించేది జగనే. కులాల కుట్రలతో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాపు సోదరుల్లారా.. తస్మాత్ జాగ్రత! ఇవాళ కాపు నాయకుడు అని అంబటికి నిన్నటి వరకు లేని తోక తగిలించి డ్రామాలు ఆడుతున్నారు. తన ఐదేళ్లలో జగన్ కాపులకు ఏం చేశారో గుండెలపై చేయి వేసుకుని చెప్పాలి. కాపులకు టీడీపీలో చంద్రబాబు నేతృత్వంలోనే న్యాయం జరిగింది. ఆయన 2014 నుంచి 2019 వరకు చేసిన పాలనలో ఈడబ్ల్యూఎస్ కింద కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు ఇచ్చారు. జగన్ వచ్చి వాటిని రద్దు చేశాడు. ఆయనా కాపుల గురించి మాట్లాడేది! కాపు సోదరులు తొందరపడక ఆలోచించాలి. కులాల పేరుతో జగన్ కుయుక్తులను గమనించాలి. అంబటి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. జగన్ వేస్తున్న ఉరితాడుతో ఆయన రాజకీయ భవిష్యత్ సమాధి అవుతుంది’ అని స్పష్టంచేశారు. 2029లో తాను జగ్గంపేట నుంచి కాకుండా వేరే చోట నుంచి శాసనసభలో అడుగుపెడతానని, జగ్గంపేట నుంచి తన తనయుడు జ్యోతుల నవీన్ బరిలోకి దిగుతారని నెహ్రూ వెల్లడించారు.