మీ జంగిల్ రాజ్ భూస్థాపితం కాకతప్పదు
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:29 AM
ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలలను రేపే చేయి కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాకతప్పదు. మీరు సృష్టించిన ‘జంగిల్ రాజ్’ భూస్థాపితం కాకతప్పదు.
అంబటి, జోగి ఇళ్లకు నిప్పు పెట్టి భయాన్ని కలిగించానని అనుకోవడం మీ భ్రమే
ఆ వేడి మీ సర్కారును దహించక మానదు
సీఎం చంద్రబాబుకు జగన్ శాపనార్థాలు
అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలలను రేపే చేయి కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాకతప్పదు. మీరు సృష్టించిన ‘జంగిల్ రాజ్’ భూస్థాపితం కాకతప్పదు. చరిత్ర చెప్పే సత్యం ఇది’ అని సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జగన్ శాపనార్థాలు పెట్టారు. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి, ఇంటిని దహనం చేసిన నేపథ్యంలో జగన్ ఆదివారం ఆయన్ను ఫోన్‌లో పరామర్శించారు. అనంతరం సీఎంను ఉద్దేశించి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ‘ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌లు ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ నిర్ధారణ చేసిన తర్వాత, ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని అనుకోవడం మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి.’ అని ఆ పోస్టులో జగన్ హెచ్చరించారు. కాగా, వైసీపీ సీనియర్ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని మరో పోస్టులో జగన్ కోరారు. ‘సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే మా పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ఇంటిపైకి తెలుగుదేశం పార్టీ గూండాలు వెళ్లారు. రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు గూండాల్లా హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు, హత్యాయత్నం చేస్తారా? మా పార్టీ సీనియర్ నాయకులపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతున్నా. డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీతో సహా బాధ్యత వహించాల్సిన అధికారులు అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని జగన్ పేర్కొన్నారు.