Share News

అనుమతి లేకుండా మళ్లీ జగన్‌ యాత్ర

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:22 AM

పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మరోసారి పరామర్శ యాత్రకు బయల్దేరుతున్నారు.

అనుమతి లేకుండా మళ్లీ జగన్‌ యాత్ర

  • నేడు అంబటి కుటుంబ సభ్యుల పరామర్శ కోసం గుంటూరుకు

  • నాడు మందీమార్బలంతో రెంటపాళ్లకు

  • ఆయన కారు కిందపడి ఒకరు మృతి

  • గుండెపోటుతో మరొకరు, అంబులెన్సుకు దారి ఇవ్వక ఇంకొకరు మృత్యువాత

  • ఇప్పుడు మరో పరామర్శకు సిద్ధం

  • భయాందోళనలో ప్రజానీకం

  • జగన్‌ పర్యటనకు అనుమతి లేదన్న ఎస్పీ

గుంటూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మరోసారి పరామర్శ యాత్రకు బయల్దేరుతున్నారు. సీఎం చంద్రబాబును, తెలుగు మహిళలను అసభ్యకరమైన పదజాలంతో దూషించిన కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నాయకుడు అంబటి రాం బాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బుధవారం ఆయన గుంటూరు పర్యటనకు సిద్ధమయ్యారు. గతంలో పల్నాడు జిల్లా రెంటపాళ్లలో ఆయన పటాటోపంతో పరామర్శకు వెళ్లినప్పుడు ముగ్గురు బలైన నేపథ్యంలో ఈసారి ఆయన మళ్లీ మందీమార్బలంతో రోడ్డెక్కితే ఏం జరుగుతుందోనని సామాన్య ప్రజలతో పాటు పోలీసులూ ఆందోళన చెందుతున్నారు. 2024 ఎన్నికల సమయంలో బెట్టింగులు కట్టి.. భారీగా డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత కొర్లగుంట నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు 2025 జూన్‌ 18న పల్నాడు జిల్లా రెంటపాళ్లకు వెళ్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఆయన పర్యటనకు అనుమతి లేదని.. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధం విధిస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. కానీ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జగన్‌ భారీ సంఖ్యలో వాహనాలు, కార్యకర్తలతో దండయాత్రకు బయల్దేరారు. ఆ సందర్భంగా గుంటూ రు నగర శివారులోని జాతీయ రహదారిపై వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (50)ను జగన్‌ కారు తొక్కుకుంటూ వెళ్లింది. సిం గయ్య తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉండగా కనీసం కనికరం చూపకుండా జగన్‌ కారు ఆపకుండా ముందుకు వెళ్లిపోయారు. చివరకు పోలీసులు సింగయ్యను అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


తన కారు కింది సింగయ్యపడి మృతి చెందాడని తెలిసినప్పటికీ జగన్‌ కారు దిగకపోగా ఆ తర్వాత కూడా సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి జగన్‌ కారును సీజ్‌ చేశారు. ఆ తర్వాత సత్తెనపల్లిలో ప్రధాన రహదారిలో జగన్‌ ర్యాలీ నిర్వహించడంతో అంబులెన్సు కదిలే దారిలేక.. అందులో గుండెపోటుతో బయల్దేరిన ముప్పాళ్ళ మండలం మాదల గ్రామానికి చెందిన తెల్లజర్ల మధు (25) మృతి చెందారు. అలాగే నాడు జగన్‌ పర్యటనకు వచ్చిన మరో వైసీపీ కార్యకర్త కూడా రోడ్డుపై కుప్పకూలి మృతి చెందారు. పోలీసు హెచ్చరికలను లెక్కచేయకుండా విగ్రహావిష్కరణ పేరుతో జగన్‌ చేసిన దండయాత్ర ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. అక్కడే మొదటిసారి వైసీపీ కార్యకర్తలు, రప్పారప్పా.. పొట్టేళ్లను నరికినట్లు నరుకుతామంటూ ఫ్లెక్సీలు పెట్టారు. అది మొదలు జగన్‌ ఎక్కడకు వెళ్లినా వైసీసీ కార్యకర్తలు వీటినే పెద్దపెద్దగా ఏర్పాటు చేస్తున్నారు.


హెచ్చరికలు బేఖాతర్‌ చేస్తే చర్యలు: ఎస్పీ

కాగా.. జగన్‌ బుధవారం గుంటూరులో తలపెట్టిన అంబటి కుటుంబ సభ్యుల పరామర్శ యాత్రకు అనుమతి ఇవ్వాలని వైసీపీ నాయకులు పోలీసు అధికారులను కోరగా.. వారు నిరాకరించారు. గుంటూరు నగరంలో 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉందని.. ఈ నేపథ్యంలో సమావేశాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రకటించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా, సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కలిగించినా చర్యలు తప్పవని.. తమ హెచ్చరికలను బేఖాతరు చేసి యాత్ర చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా జగన్‌ గుంటూరు యాత్రకు సిద్ధం కావడంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆయన పర్యటన ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు కారణం అవుతుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ కార్య కర్తల ముసుగులో రౌడీషీటర్లు, గూం డాలు రెచ్చిపోయే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు శాఖ కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అంబటి ఇల్లు, కార్యాలయం ఉన్న సిద్ధార్థ నగర్‌ సమీప ప్రాంతాల్లోని టీడీపీ నాయకుల ఇళ్లు, కార్యాలయాలు, అతిథి గృహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో పోలీసులు, సా యుధ బలగాలను కూడా రంగంలోకి దించుతోంది.

Updated Date - Feb 04 , 2026 | 05:23 AM