Share News

జగన్‌... మళ్లీ ల్యాండ్‌ టైట్లింగ్‌ పేరెత్తే ధైర్యం ఉందా..!

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:23 AM

‘మళ్లీ అధికారంలోకి వస్తే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుని పునరుద్ధరిస్తా. సర్వే రాళ్లపై, పాసు పుస్తకాల్లో నా బొమ్మ వేసుకుంటా... అని చెప్పగలరా జగన్‌?’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రశ్నించారు.

జగన్‌... మళ్లీ ల్యాండ్‌ టైట్లింగ్‌ పేరెత్తే ధైర్యం ఉందా..!

  • ఆ చట్టం వల్లే వైసీపీకి ఘోర ఓటమి: కేంద్ర మంత్రి పెమ్మసాని

  • మళ్లీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలు భూములు లాక్కుంటారని జనం భయపడ్డారు

గుంటూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ‘మళ్లీ అధికారంలోకి వస్తే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుని పునరుద్ధరిస్తా. సర్వే రాళ్లపై, పాసు పుస్తకాల్లో నా బొమ్మ వేసుకుంటా... అని చెప్పగలరా జగన్‌?’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలకు ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ కాకుండా జిరాక్స్‌ కాపీలు ఇస్తామని చెప్పే ధైర్యం ఉందో, లేదో జగన్‌ చెప్పాలి. 2029లో జరిగే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి తాను అధికారంలోకి వస్తే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్డు తీసుకొచ్చి గతంలో ఏవైతే నిబంధనలు అందులో పొందుపరిచారో, అవన్నీ అమలు చేస్తానని చెబితే అప్పుడు ప్రజలు ఆయన్ని నమ్ముతారో, కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతారో తేలుతుంది. అహంకారం, అహంభావం, అసమర్థత వల్ల గత ఎన్నికల్లో ప్రజలు మట్టికరిపించారన్న విషయాన్ని జగన్‌ జీర్ణించుకోవాలి. ల్యాండ్‌ సర్వే, రీసర్వే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానిది. ఇది గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. అయితే సర్వే, రీసర్వేని పూర్తి చేయకపోవడం వల్ల ప్రోత్సాహకాల కోసం గత వైసీపీ ప్రభుత్వం దరఖాస్తు చేయలేదు. ఇందులో రైతులకు సంబంధించిన ఫిర్యాదులు లక్షలున్నాయి. వాటిని పరిష్కరించకపోవడం వల్ల ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విషయాన్ని నేను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. 2 లక్షల 79 వేల 712 ప్రజా ఫిర్యాదులను గ్రామసభల ద్వారా పరిష్కరించాలని చెప్పాను. ఇందులో భూమి కొలతల్లో వ్యత్యాసాలు 99 వేలు, జాయింట్‌ ల్యాండ్‌ పార్సిల్స్‌ వివాదాలు 64 వేలు, రెవెన్యూ సమస్యలు 1.14 లక్షల కేసులున్నాయి.


వీటిని కేంద్రంతో సమన్వయం చేసుకుని క్లియర్‌ చేసి ప్రోత్సాహకాల కోసం అప్లై చేసి రూ.500 కోట్లు తెచ్చిన ఘనత మాకే దక్కుతుంది. జగన్‌పై వ్యతిరేకతకు కారణం సర్వే, రీసర్వే కాదు. సర్వే చేసిన తర్వాత కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలి. అయితే వాటిపై జగన్‌ తన బొమ్మ వేసుకున్నారు. తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులపై దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి వారి బొమ్మ వేసుకోలేదు. దీనికి రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు. రూ.680 కోట్లు ఖర్చు పెట్టి జగన్‌ బొమ్మతో సర్వే రాళ్లు వేశారు. భయానకమైన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వలన ఏదైనా వివాదం ఉంటే సివిల్‌ కోర్టులను బైపాస్‌ చేసి, తహసీల్దారు కార్యాలయాలను మాత్రమే ఆశ్రయించాలన్న నిబంధన పొందుపరిచారు. అక్కడ న్యాయం దక్కలేదంటే హైకోర్టుకు వెళ్లాలి తప్ప సివిల్‌ కోర్టులకు వెళ్లలేరు. హైకోర్టుకు వెళ్లాలంటే ఫీజుల రూపంలో రూ.లక్షలు ఖర్చు చేయాలి. అంత మొత్తాన్ని పేదలు భరించలేరు. ఈ నేపథ్యంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి చేసి భూములు లాక్కొంటారన్న భయాందోళనలు జనంలో వచ్చాయి. అందుకే ప్రజలు వైసీపీని ఘోరంగా ఓడించారు. అంతే తప్ప సర్వే, రీసర్వే వల్ల కాదు’ అని పెమ్మసాని స్పష్టం చేశారు.

Updated Date - Jan 25 , 2026 | 03:23 AM