హవ్వ.. నవ్విపోదురు గాక!
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:28 AM
‘అంబటి రాంబాబు కాపు కులంలో పుట్టిన విలువలున్న వ్యక్తి, టైగర్. చంద్రబాబును తిట్టినా... తర్వాత సారీ చెప్పారు కాబట్టి అంబటిని పొగడాలి’... ఇదీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూత్రీకరణ!
తిట్టి సారీ చెప్పినందుకు పొగడాలంట!
కాపు కులంలో రాంబాబు టైగర్ అంట!
సొంత పార్టీ నేతలే నవ్వుకునేలా జగన్ వ్యాఖ్యలు
అంబటి బూతుల చరిత్ర మరిచి పొగడ్తలు
గుంటూరు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘అంబటి రాంబాబు కాపు కులంలో పుట్టిన విలువలున్న వ్యక్తి, టైగర్. చంద్రబాబును తిట్టినా... తర్వాత సారీ చెప్పారు కాబట్టి అంబటిని పొగడాలి’... ఇదీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూత్రీకరణ! అంబటి కుటుంబానికి పరామర్శ పేరిట ఆయన బుధవారం గుంటూరు వచ్చారు. కుటుంబ సభ్యులను పలకరించి, వారికి ధైర్యం చెప్పి వెళితే బాగుండేది. కానీ... ‘అంబటి టైగర్’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. వివాదాస్పదులకు జగన్ ఇచ్చే ప్రాధాన్యం మరోసారి రుజువైంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అంబటి రాంబాబు అభివృద్ధి కార్యక్రమాలతో కంటే వివాదాలు, అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. రాజకీయం అంటేనే జుగుప్స కలిగించేలా గత పదేళ్లుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుపైనా, పవన్ కల్యాణ్‌పైనా పత్రికల్లో ప్రచురించలేని భాషలో బూతులు మాట్లాడారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతంలో ఏ రాజకీయ నాయకుడిపై రానన్ని అసభ్యకర, అవినీతి ఆరోపణలు అంబటి రాంబాబుపై వచ్చాయి. ఆయన ఒక మహిళతో నెరిపిన ఫోన్ సంభాషణ అప్పట్లోనే తీవ్ర దుమారం రేపింది. దాడులు చేయడం, బూతులు తిట్టడమే అర్హత అన్నట్లుగా అంబటి రాంబాబుకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు. పవన్‌కల్యాణ్, చంద్రబాబు కుటుంబాలపై భయంకరంగా నోరు పారేసుకున్న అంబటిపై టీడీపీ క్యాడర్ ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. తాజాగా ఆయన బూతులు మరీ శ్రుతిమించడమే దాడులకు కారణమని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ... ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎవరైనా చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే అని సంకేతాలు పంపింది. ఎమ్మెల్యే దంపతులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.