అడ్డగోలు అబద్ధాలు!
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:06 AM
మత్స్యకారులను రెచ్చగొట్టడం, ప్రభుత్వంపై బురదజల్లడం! ఇదే లక్ష్యంగా అబద్ధాలు, అర్ధసత్యాలు! విశాఖపట్నంలో గల్లంతైన మత్స్యకారుల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరిది!
మత్స్యకారుల గల్లంతు ఘటనలో జగన్ వైఖరిపై విస్మయం
అధికారులు రాత్రంతా పట్టించుకోలేదంటూ ఆరోపణలు
సమాచారం అందిన పది నిమిషాల్లోనే స్పందించిన యంత్రాంగం
సాయంత్రమే విషయం తెలిసినా అధికారులకు చెప్పని వైసీపీ నేత!
ఇప్పుడు ‘నిర్లక్ష్యం’ అంటూ బురద
విశాఖపట్నం, జూలై 15(ఆంధ్రజ్యోతి): మత్స్యకారులను రెచ్చగొట్టడం, ప్రభుత్వంపై బురదజల్లడం! ఇదే లక్ష్యంగా అబద్ధాలు, అర్ధసత్యాలు! విశాఖపట్నంలో గల్లంతైన మత్స్యకారుల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరిది! మంగళవారం విశాఖలో మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది ప్రభుత్వ వైఫల్యం. మత్స్యకారులను ఆదుకోవడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేశారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి వైసీపీ నాయకుడు జానకి (వాసుపల్లి జానకీరామ్) అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. మరుసటిరోజు తెల్లవారు జామున ఐదు గంటల వరకు అధికారులకు ఏమీ తెలియదని త్రిసభ్య కమిటీ పేర్కొంది’’ అని జగన్ తెలిపారు. ఇవన్నీ నిజమని నమ్మించేందుకు పలు స్ర్కీన్ షాట్లు, కాగితాలు చూపించారు. కానీ... ఆ కాగితాలు, స్ర్కీన్‌షాట్లలో ఉన్నదొకటైతే... జగన్ మాట్లాడింది మరొకటి! మత్స్యకారుల గల్లంతు సమాచారం అందిన నిమిషాల్లోనే అధికారులు స్పందించి, వివరాలు తెలుసుకుని, సమన్వయం చేసుకోవడం మొదలుపెట్టారన్నది నిజం. ‘మత్స్యకారులు గల్లంతైనట్లు 5వ తేదీ ఉదయం 5 గంటల దాకా వారి కుటుంబ సభ్యులకు తెలియదు’ అని త్రిసభ్య కమిటీ పేర్కొనగా... జగన్ దానినీ వక్రీకరించారు. ‘5వ తేదీ ఉదయం 5 గంటల దాకా మత్స్యకారులు గల్లంతైన విషయం అధికారులకు తెలియదని త్రిసభ్య కమిటీ రిపోర్టులో ఉంది’ అని అవాస్తవాలు చెప్పారు.
ఎప్పుడేం జరిగిందంటే...
ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు వేట నుంచి తిరిగి వచ్చేస్తున్నామని బోటు యజమాని కారి చిన్నా తన సోదరుడు గణేశ్‌కు ఫోన్ చేసి చెప్పారు. గంట తర్వాత గణేశ్ తిరిగి ఫోన్ చేయగా బోటులో ఎవరూ స్పందించలేదు. ఈ విషయాన్ని ఆయన ఈస్ట్‌కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు అసోసియేషన్ నాయకుడు వాసుపల్లి జానకీరామ్ (వైసీపీ నేత)కు తెలిపారు. సాయంత్రం 5 గంటల్లోపే మత్స్యకారుల బోటు గల్లంతుపై జానకిరామ్‌కు తొలి సమాచారం అందినట్లు తెలుస్తోంది. కానీ... ఈ విషయాన్ని వెంటనే ఆయన అధికారులకు చెప్పలేదు. రాత్రి 10.15 గంటలకు మీడియాకు, మత్స్యశాఖ డెవల్‌పమెంట్ ఆఫీసర్ ఆశాజ్యోతికి తెలిపారు.
రాత్రి 10.30 గంటలకు మెరైన్ సీఐకి ఒక వ్యక్తి ఫోన్ చేసి బోటు కనిపించడం లేదని తెలిపారు. ఈలోపే... ఆశాజ్యోతి తనకు అందిన సమాచారాన్ని పూర్తిగా నిర్ధారించుకొని, మత్స్యశాఖ డైరెక్టర్‌కు, జాయింట్ డైరెక్టర్‌కు సమాచారమిచ్చారు.
రాత్రి 10.48 గంటలకు జానకిరామ్... ‘నేను ఫలానా. ఫలానా వ్యక్తికి చెందిన బోటు గల్లంతైంది. గాలింపు చర్యలు చేప్టటండి’ అని జిల్లా స్థాయి అధికారుల్లో ఒకరికి వాట్సాప్ మెసేజ్ పెట్టారు.
రాత్రి 10.55 గంటలకు జానకీరామ్‌కు మెరైన్ సీఐ ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
రాత్రి 11.30 గంటలకు మత్స్యకార సంఘాల సభ్యులతో మాట్లాడి, గల్లంతైన బోటు, అందులో వేటకు వెళ్లిన వారి వివరాలు తీసుకొని సెర్చ్ అండ్ రెస్క్యూ నివేదిక తయారుచేశారు.
రాత్రి 11.50 గంటలకు మత్స్య శాఖ జేడీ గాలింపు చర్యలు చేపట్టాలని కోరుతూ కోస్టల్ సెక్యూరిటీకి, జిల్లా కలెక్టర్‌కు, ఫిషరీస్ ప్రధాన కార్యాలయానికి ఈ-మెయిల్ పెట్టారు.
అర్ధరాత్రి 12.16 గంటలకు గాలింపు చర్యలు చేపట్టాలని కోరుతూ నేవీ, కోస్ట్‌గార్డులకు ఈ-మెయిల్స్ పంపించారు. అదే సమయంలో కోస్టల్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసి మత్స్యకారులను రక్షించడానికి తక్షణమే నౌకలను పంపాలని కోరారు.
5వ తేదీ ఉదయం అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు
మత్స్యశాఖ కమిషనర్
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): విశాఖ తీరంలో మత్స్యకారుల పడవ ప్రమాదంపై ప్రభుత్వం తక్షణం స్పందించి, గల్లంతైన జాలర్ల ఆచూకీ కోసం యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిందని మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టితో కలిసి మీడియాతో మాట్లాడారు. సముద్రంలో ప్రతికూల వాతావరణం, బలమైన గాలుల కారణంగా ప్రమాదం జరిగిందని చెప్పారు. దీనిపై అధికార యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించిందని, ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. తీర ప్రాంత రక్షక దళం, నౌకాదళం, మెరైన్ పోలీస్, విపత్తుల నిర్వహణ శాఖలతో కలిసి జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో 72గంటలపైగా విస్తృత గాలింపు, సహాయ చర్యలు చేపట్టామన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఇప్పటికిప్పుడు పరిహారం చెల్లించేందుకు నిబంధనలు అంగీకరించకున్నా... మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున అందించిందని చెప్పారు.
ఇదీ నిజం...
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీపై రాత్రంతా అధికారులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. రాత్రి చీకటి పడ్డాక హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కష్టం. ఇక... గల్లంతైన బోటులో ట్రాన్స్‌పాండర్ ఉంటే ఆ లొకేషన్‌కు నేవీ బోట్లను పంపే వీలుండేది. కానీ... మత్స్యకారుల బోటులో ట్రాన్స్‌పాండర్‌ను ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. 5వ తేదీ ఉదయం నుంచి కోస్ట్‌గార్డు, నేవీకి చెందిన నౌకలు, హెలికాప్టర్లు 72 గంటలు సముద్రంలో గాలించినా... గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. ఇదీ జరిగింది.