Share News

కాపులను చీల్చండి!

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:59 AM

కూటమి నుంచి కాపులను దూరం చేయాలి. వారి మధ్య విభేదాలు సృష్టించి వ్యతిరేకత పెంచేయాలి. ఏచిన్న అంశమైనా పెద్దది చేసి.. కులాల మధ్య చిచ్చు పెట్టి..

కాపులను చీల్చండి!

  • ఏ చిన్న సంఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయండి

  • కూటమికి కాపులను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి

  • ఆ నేతలతో సమావేశం పెట్టండి

  • కులాల చిచ్చుకు జగన్‌ కుట్రలు

  • ఫేక్‌ ప్రచారం వీగిపోవడంతో వైసీపీ నేత కొత్త కు(ల)తంత్రం

  • అంబటి, గుడివాడ, కురసాల, ఎమ్మెల్సీ తోటకు దిశా నిర్దేశం

  • హోం మంత్రి అనిత విషయంలో ఏమీ కాదంటూ అమర్నాథ్‌కు అండ

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): కూటమి నుంచి కాపులను దూరం చేయాలి. వారి మధ్య విభేదాలు సృష్టించి వ్యతిరేకత పెంచేయాలి. ఏచిన్న అంశమైనా పెద్దది చేసి.. కులాల మధ్య చిచ్చు పెట్టి.. తాను రాజకీయ చలిమంటలు కాచుకోవాలి!. ఇదే వ్యూహంతో వైసీపీ అధినేత జగన్‌ కు(ల)తంత్రాలకు తెరదీశారు. కాపు సామాజిక వర్గాన్ని కూటమి సర్కారుకు దూరం చేయాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయాలని, సోషల్‌ మీడియాలో రెచ్చిపోవాలని కాపు నాయకులకు నూరిపోశారు. తద్వారా కూటమి సర్కారుపై కాపుల్లో వ్యతిరేకత పెంచాలని విషం నింపారు. తాజాగా వైసీపీ అధినేత.. మంగళవారం తన పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులతో భేటీ అయ్యారు. వీరిలో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్‌, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్న ‘కాపులను వేరు చేయడం ఎలా?’ అనే విషయంపైనే దృష్టి పెట్టారు. తొలుత కాపు నాయకులతో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ వారికి నూరిపోసి వ్యతిరేకత పెంచాలని సూచించారు. ఏ చిన్న ఘటన జరిగినా దానికి కులం కార్డు జోడించి.. సోషల్‌ మీడియాలో యాగీ చేయాలని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత కక్షలు, పోలీసు కేసులను కూడా తీసుకుని కాపు సామాజికవర్గానికి అన్యాయం జరిగిపోతోందన్నట్లుగా రచ్చ చేయాలన్నారు.


వాస్తవానికి విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్‌ మిస్సింగ్‌ కేసుకు కాపు కులం కార్డు తొడిగి.. దానిని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించారు. అది విఫలం కావడంతో.. ఇలాంటి మరికొన్ని అంశాలను రాజకీయ కుట్రల కోసం వాడుకుని.. కాపుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేయాలని జగన్‌ తన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. త్వరలోనే వైసీపీకి చెందిన కాపు నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, తర్వాత ఉత్తరాంధ్రలో కూడా నిర్వహించాలని సూచించారు. జనసేనపై ఫేక్‌ ఐడీలతో చేసిన ప్రచారం వికటించడంతో.. ఇప్పుడు నేరుగానే విషం చిమ్మాలని నిర్ణయించారు. కాపులను ఏదో ఒకరకంగా రెచ్చగొట్టి, వారిలో ఐక్యతను దెబ్బతీసి తాను లబ్ధిపొందాలన్నదే జగన్‌ అంతిమలక్ష్యంగా కనిపిస్తోంది.


తనకు అధికారం ఎప్పటికీ దక్కదనే!

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాబలం ఉన్న కాపు సామాజికవర్గం దాదాపు గంపగుత్తగా 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా ఉన్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలకు కాపు నేతలంతా మద్దతు పలికారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు వర్గానికి రాజకీయంగా పెద్దగా ఒరిగిందేమీ లేదు. కూటమి అధికారాన్ని చేపట్టి రెండేళ్లవుతున్నా.. కాపు నేతలు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెంటే నడుస్తున్నారు. కూటమి పార్టీలు బీజేపీ, టీడీపీలతో మరో 15 ఏళ్లదాకా.. అవసరమైతే 30 ఏళ్లదాకా కలసి నడుస్తానని పవన్‌ కల్యాణ్‌ పార్టీ వేదికపై స్పష్టంగా చెబుతున్నారు. కూటమితో పవన్‌ కల్యాణ్‌ కలసి ఉన్నంత వరకు ఎన్నికల్లో వైసీపీ నెగ్గడం సాధ్యం కాదని, ఫలితంగా తాను ఎప్పటికీ సీఎం కాలేనని భావించిన జగన్‌.. కాపులపై కుట్రలకు తెరదీశారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. పవన్‌ను కూటమి నుంచి దూరం చేయడం కంటే.. కాపు సామాజికవర్గంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచి, వారినే కూటమికి దూరం చేయాలని నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది.

నీకేమీ కాదులే..

హోం మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అమర్నాథ్‌తో ‘నీకేమీ కాదులే.. అరెస్టు చేయరులే’ అంటూ జగన్‌ భరోసా ఇచ్చారు. జగన్‌తో మాజీ మంత్రులు గుడివాడ, అంబటి, కురసాల, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలసినప్పుడు హోంమంత్రిపై అమర్నాథ్‌ చేసిన వ్యాఖ్యలు, మహిళా కమిషన్‌ స్పం దన, పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడటం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అంబటి కూడా అమర్నాథ్‌ను ఉద్దేశించి అరెస్టు చేయరులే అంటూ అనునయించారు. ఈ సమయంలో హోం మంత్రి కూడా ఎక్కువగా మాట్లాడుతుందని జగన్‌ వ్యాఖ్యానించారు.


  • ఓట్ల తొలగింపులో బాబు దిట్ట

  • ప్రతి బూత్‌కు కనిష్ఠంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారు: జగన్‌

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌)పై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్‌ సూచించారు. ప్రతి బూత్‌కు కనీసం 50 చొప్పున వైసీపీ ఓట్లను తొలగించేలా కుట్ర చేస్తున్నారన్నారు. ఓట్ల తొలగింపులో సీఎం చంద్రబాబు దిట్ట అని ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, రీజినల్‌ కోఆర్డినేటర్లు, సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ‘సర్‌’లో ఎక్కడైనా త ప్పులు జరుగుతున్నాయని తెలిస్తే.. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అధికారులు స్పందించకపోతే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాగా.. ‘సర్‌’ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో కొనసాగుతోంది. అయితే, జగన్‌.. చంద్రబాబుపై విమర్శలు చేయడం గమనార్హం. సర్‌ ప్రక్రియపై మాత్రం పన్నెత్తు మాట అనలేదు.

Updated Date - Jun 17 , 2026 | 04:00 AM