తిరుమల పవిత్రతను చంద్రబాబు కాలరాశారు
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:17 AM
తిరుమల ఆలయ పవిత్రతను సీఎం చంద్రబాబు కాలరాశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఆరోపణలున్న వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా నియమించారు: జగన్
అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తిరుమల ఆలయ పవిత్రతను సీఎం చంద్రబాబు కాలరాశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యత. ఈ పవిత్ర స్థానాన్ని చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆరోపణలున్నాయని తెలిసి కూడా అతన్నే టీటీడీ చైర్మన్‌గా నియమించి ఆలయ ప్రతిష్ఠను మంటగలిపారు. దేవుడి పట్ల చంద్రబాబుకు భక్తి, శ్రద్ధ, భయమూ లేవని మరోసారి రుజువైంది. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలోనూ చంద్రబాబు తప్పు చేసి, వేరొకరిమీదకు నెట్టి, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు నిజాయితీ లేదనడానికి ఇది మరొక ఉదాహరణ’’ అంటూ విమర్శించారు.