అమ్మకు శుభాకాంక్షలేవీ?
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:29 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంపై వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
విజయలక్ష్మికి బర్త్‌డే విషెస్ చెప్పని జగన్
శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌కు మాత్రం త్వరగా కోలుకోవాలని పోస్టు
విజయలక్ష్మికి ‘ఎక్స్’లో శుభాకాంక్షలు చెప్పిన షర్మిల, లోకేశ్
అమరావతి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంపై వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం. ఆదివారం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భార్య, జగన్ తల్లి విజయలక్ష్మి 70వ జన్మదినం. ఆమె కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ‘ఎక్స్’ వేదికగా విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ కూడా ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని ఆకాంక్షించారు. కానీ జగన్ మాత్రం పవన్ త్వరగా కోలుకోవాలని ‘ఎక్స్’లో పోస్టు చేశారని.. తల్లికి కూడా సామాజిక మాధ్యమాల ద్వారానైనా శుభాకాంక్షలు తెలిపితే బాగుండేదని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.