వ్యతిరేకం కాదన్నప్పుడు.. అసెంబ్లీకి వెళ్లరేం?
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:42 AM
ప్రజా రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని జగన్ తన నేతలతో ప్రచారం చేయించుకుంటున్నారు. అయితే నిజంగా సానుకూలంగా ఉంటే..
నేడు సభ ప్రత్యేకంగా భేటీ అవుతుంటే జగన్ బెంగళూరు చెక్కేయడమేంటి?
వైసీపీ నేతల్లోనే అసహనం పైగా తీర్మానం ఇప్పుడెందుకన్న సజ్జల
మండలిలో కూడా పెట్టాలని సన్నాయి నొక్కులు
అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ప్రజా రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని జగన్ తన నేతలతో ప్రచారం చేయించుకుంటున్నారు. అయితే నిజంగా సానుకూలంగా ఉంటే.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఎందుకు హాజరు కావడం లేదని వైసీపీ నేతలే అంతర్గతంగా ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీచేశాక.. గురువారమే ఆయన బెంగళూరు ప్యాలె్‌సకు వెళ్లడాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించి రాష్ట్ర విభజన చట్టంలో చేర్చేందుకు కేంద్రం సైతం సుముఖంగా ఉందని.. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) సూచనలతోనే.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడానికి సీఎం చంద్రబాబు అత్యవసరంగా సభను సమావేశపరుస్తున్నారని తెలిశాక కూడా.. జగన్ ద్వంద్వ వైఖరిని అవలంబించడంపై కొందరు పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు గుర్రుగా ఉన్నారు. అమరావతి తీర్మానానికి మద్దతిస్తున్నామంటూ ఆయన ఒక్క మాట చెప్పినా సరిపోతుందని.. అలాకాకుండా సకల శాఖా మంత్రిగా పేరుగాంచిన ఆ పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని తెరపైకి తెచ్చారని వారు ఆక్షేపించారు. అమరావతిని ఎవరు కాదన్నారు.. జగన్ వ్యతిరేకం కాదని అంటూనే.. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం ఎందుకని గురువారం ఆయన అన్నారు.
పైగా శాసన మండలిలోనూ తీర్మానంపై చర్చ పెట్టాలని ఆయన సన్నాయి నొక్కులు నొక్కడాన్ని వైసీపీ నేతలు కొందరు తప్పుబడుతున్నారు. మండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఉన్నందున తీర్మానాన్ని ఓడించాలన్నదే ఆయన ఉద్దేశమని ప్రజలకు అర్థమైందని అంటున్నారు. 2014లో అసెంబ్లీలో అమరావతికి మద్దతిచ్చిన జగన్.. 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుని రాజధానిని మార్చబోమని ప్రజలను నమ్మించి.. తీరా అధికారంలోకి వచ్చాక రాజధానిని ధ్వంసం చేసి.. మూడు ముక్కలాట ఆడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నిజంగా అమరావతికి వ్యతిరేకం కాకుంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ఎందుకు హాజరు కారని వైసీపీ శ్రేణలు ప్రశ్నిస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న జగన్ అండ్ కో.. సభకు హాజరై అదే విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉందని గుర్తుచేస్తున్నాయి. ప్రత్యేక అసెంబ్లీకి హాజరుకాకుండా బెంగళూరు వెళ్లిపోవడం ద్వారా అమరావతికి తాను వ్యతిరేకినని ఆయన మరోసారి రుజువు చేసుకున్నారని వైసీపీ ముఖ్య నేతలు అంతర్గతంగా వాపోతున్నారు.