Share News

టెట్‌పై కేంద్రంతో మా ఎంపీలు మాట్లాడతారు

ABN , Publish Date - Jul 08 , 2026 | 04:58 AM

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు టెట్‌ రాసే అంశంపై కేంద్ర మంత్రులతో తమ పార్టీ ఎంపీలు మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపుతారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

టెట్‌పై కేంద్రంతో మా ఎంపీలు మాట్లాడతారు

  • ఉపాధ్యాయ సంఘాల నేతలతో జగన్‌

పులివెందుల, జూలై 7(ఆంధ్రజ్యోతి): సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు టెట్‌ రాసే అంశంపై కేంద్ర మంత్రులతో తమ పార్టీ ఎంపీలు మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపుతారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని(ఈ నెల 8) పురస్కరించుకుని జగన్‌ రెండురోజుల పర్యటన నిమిత్తం మంగళవారం బెంగళూరు నుంచి పులివెందుల చేరుకున్నారు. క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నిర్వహించడం సరికాదని వారు చెప్పారు. విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని జగన్‌ను కోరారు. బీఈడీ చదివి, పరీక్షలు రాసి ఉద్యోగం పొంది మళ్లీ 25 ఏళ్ల తర్వాత టెట్‌ రాయాల్సి రావడం ఏమిటని నేతలు వాపోయారు.


మొర వినేందుకు మీనమేషాలు!

ప్రొద్దుటూరుకు చెందిన కాశీవిశ్వనాథ్‌, లింగమ్మకు జన్మించిన వర్షిత్‌ అనే చిన్నారికి దీర్ఘకాలిక వ్యాధి వచ్చిందని, సాయం చేయాలని కోరుతూ వర్షిత్‌ బంధువులు జగన్‌ను కలిసేందుకు క్యాంప్‌ కార్యాలయానికి వచ్చారు. అయితే, జగన్‌ను కలిసేందుకు వారికి అవకాశం దక్కలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు బ్యానర్‌ పట్టుకుని వర్షిత్‌ను కాపాడేందుకు సాయం చేయాలని, జగన్‌ను కలిసేందుకు వీలుకల్పించాలని నినాదాలతో కూడిన నిరసనకు దిగారు. చివరకు పోలీసులు, వైసీపీ నాయకులు అతి కష్టమ్మీద జగన్‌ను కలిసేందుకు వీలు కల్పించారు. వీరి సమస్య విన్న జగన్‌ సానుకూలంగా స్పందించారు.

Updated Date - Jul 08 , 2026 | 05:00 AM