Share News

గ్రూప్‌-1, డీఎస్సీలపై సీబీఐ విచారణ నాకు ఓకే

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:06 AM

గతంలో 2018లో నోటిఫికేషన్‌ విడుదల చేసిన గ్రూప్‌-1పైనా, 2025 డీఎస్సీపైనా సీబీఐ విచారణకు తాను సిద్ధమేనని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు.

గ్రూప్‌-1, డీఎస్సీలపై సీబీఐ విచారణ నాకు ఓకే

  • మా పాలనలో అన్నీ సక్రమమే

  • మరోసారి జగన్‌ సుద్దులు

  • ఏపీపీఎస్సీ, డీఎస్సీ ఒక్కటేనని వ్యాఖ్య

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): గతంలో 2018లో నోటిఫికేషన్‌ విడుదల చేసిన గ్రూప్‌-1పైనా, 2025 డీఎస్సీపైనా సీబీఐ విచారణకు తాను సిద్ధమేనని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. దర్యాప్తునకు ఆదేశించే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 2019లో తాను అధికారాన్ని చేపట్టే నాటికే 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైందని, ప్రిలిమినరీ ఎగ్జామ్స్‌ కూడా జరిగాయని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక గ్రూప్‌-1 ప్రక్రియను కొనసాగించానని తెలిపారు. గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో ఎక్కడా అక్రమాలు జరగలేదని సీఎం చంద్రబాబు వేసిన సీఐడీ దర్యాప్తులో నిగ్గుతేల్చిందని చెప్పారు. దాంతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తానే లీగల్‌ అధికారిగా, న్యాయవాదిగా, పోలీసు అధికారిగా, దర్యాప్తు సంస్థగా వ్యవహరిస్తూ మరో దర్యాప్తును వేశారని అన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో డిజిటల్‌ మూల్యాంకనమే జరగలేదన్నారు. కరోనా సమయంలో డిజిటల్‌ మూల్యాంకనాన్ని చేయాలనుకున్నా కోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌ ఇవాల్యుయేషన్‌ మాత్రమే నిర్వహించారని చెప్పారు. హాయ్‌ల్యాండ్‌కు పేపర్లు తీసుకువెళ్లి దిద్దారనడంపై చర్చే అనవసరమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా సీనియర్‌ పోలీసు అధికారి, నిజాయితీపరుడు గౌతం సవాంగ్‌ సీసీ కెమెరాల మధ్య మాన్యువల్‌ మూల్యాంకనం చేయించారన్నారు. సెల్‌ఫోన్లలో ఇవాల్యుయేటర్లు మాట్లారంటూ చేస్తున్న విమర్శలు అర్థరహితమని అన్నారు.


మీరు జీవితాలతో చెలగాటం ఆడొచ్చా?

జగన్‌: కొడుకును కాపాడేందుకు 2018 గ్రూప్‌-1పై సీఎం ఆరోపణలు చేస్తున్నారు.165 మంది ఉన్నతస్థాయి అధికారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

వాస్తవం: డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మొత్తం డీఎస్సీని రద్దు చేయాలని వైసీపీ హైకోర్టులో వ్యాజ్యం వేసేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది. మొత్తం 15,941 మంది ఉద్యోగాలు రద్దు చేయాలని పట్టుబడుతోంది. కానీ తమ హయాంలో జరిగిన గ్రూప్‌-1 కుంభకోణంపై మాత్రం ఆరోపణలు చేయడం తప్పని నీతులు చెబుతోంది. 165 మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటున్న జగన్‌.. 15,941 మంది జీవితాలతో తాను చెలగాటం ఆడొచ్చా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడానికి ఒక్క ఆధారమూ లేకపోయినా డీఎస్సీ ఉద్యోగాలన్నీ రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ప్రతి జవాబుపత్రం మీద బార్‌ కోడ్‌ ఉంటుందని, అభ్యర్థి ఎవరో ఇవాల్యుయేటర్లకు తెలియదని, అలాంటప్పుడు వారు సెల్‌ఫోన్‌లో మాట్లాడితే తప్పేమిటని అన్నారు. డీఎస్సీలో ప్రశ్నపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే అధికారికి నిబంధనలకు విరుద్ధంగా ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఎస్‌ఈఆర్‌టీ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌కు ఒకటో ర్యాంకు వస్తే కాల్‌ లెటర్‌ ఎందుకు పంపలేదని, డీఎస్సీ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయకుండా ఆయన ఐడీని ఎందుకు బ్లాక్‌ చేశారని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్‌ కోటా పేరిట రాతపరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఎలా ఇచ్చారన్నారు. ఉద్యోగాల కోసం ఆర్థిక లావాదేవీలు, బేరసారాలు జరిగినట్లుగా ఆడియో లీక్‌ అయితే దానిపై స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పోలీసులు ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ఇరవై ఐదేళ్ల పాటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు టెట్‌ రాయడం ఏమిటన్నారు.

జగన్‌ అయోమయ ప్రశ్న: ‘మీ హయాంలో జరిగిన డీఎస్సీపై.. 2018లో మా హయాంలో జరిగిన డీఎస్సీపై సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా అని మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్‌ సవాల్‌ విసిరారు. జగన్‌ జమానాలో డీఎస్సీ జరిగిందా అని అక్కడున్నవారు అవాక్కయ్యారు. తర్వాత జగన్‌ ముందుకు ఓ స్లిప్పు రావడంతో.. 2025 డీఎస్సీపైనా, 2018 గ్రూప్‌-1పైనా సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా అని సవరించుకున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 04:10 AM