Share News

వైసీపీలో స్తబ్ధత!

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:04 AM

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలోనే తమ అధినేత జగన్‌ మీడియాకెక్కి.. రాజధానికి ప్లాన్‌-బీ కింద మచిలీపట్నం(మా), విజయవాడ (వీఐ), గుంటూరు (గన్‌)..

వైసీపీలో స్తబ్ధత!

  • మావి‘జగన్‌’పై పార్టీ ముఖ్యుల్లో తీవ్ర అసంతృప్తి

  • జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయముంటే.. స్వరాష్ట్రంలో వ్యతిరేక గళమా?

  • సీఆర్‌డీఏ పరిధిపై అవగాహన లేకపోతే ఎలా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలోనే తమ అధినేత జగన్‌ మీడియాకెక్కి.. రాజధానికి ప్లాన్‌-బీ కింద మచిలీపట్నం(మా), విజయవాడ (వీఐ), గుంటూరు (గన్‌).. వెరసి ‘మావిగన్‌’ను నిర్మించాలంటూ చేసిన సూచనతో వైసీపీ ముఖ్య నేతల మైండ్‌ బ్లాంక్‌ అయింది. పార్టీ యంత్రాంగమంతా చేష్టలుడిగిపోయింది. సీనియర్‌ నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఐదేళ్లు రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడి.. జనం చేతుల్లో చావుదెబ్బ తిన్నది సరిపోలేదా.. అని తలలు పట్టుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో జగన్‌పై విరుచుకుపడుతూ పెడుతున్న పోస్టులకు వణికిపోతున్నారు. చివరకు తమ అనుకూల చానళ్లు సైతం ఆయన వ్యాఖ్యలను సమర్థించకపోవడంతో.. వారు సొంత మీడియాతో మాట్లాడేందుకు కూడా వెనుకా ముందాడుతున్నారు. సాధారణంగా జగన్‌ మీడియాతో గానీ, ఏదైనా సభలో గానీ మాట్లాడితే.. ప్రత్యర్థులు ఆయన్ను విమర్శిస్తే వైసీపీ శ్రేణులు, సోషల్‌ మీడియా తీవ్ర స్థాయిలో దాడికి దిగేవి. ఈసారి రివర్స్‌ అయింది. జగన్‌ ‘మావిగన్‌’ అని అన్నారో లేదో.. టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు సోషల్‌ మీడియా ద్వారా విరుచుకుపడడం మొదలుపెట్టాయి. దీనికి ఎలా స్పందించాలో అర్థం గాక.. జగన్‌ తీరును సమర్థించలేక వైసీపీ నేతల నోళ్లు మూతబడ్డాయి. తమ అధినేత మాట్లాడి 24 గంటలైనా.. ఆయన ఉద్దేశమేంటో ప్రజలకు తెలియజెప్పే సాహసం చేయలేకపోవడం గమనార్హం. పార్లమెంటు ఆమోదించిన బిల్లులో అమరావతి, సీఆర్‌డీఏ పరిధిలోని ప్రాంతాలన్నిటినీ చేర్చారని.. ఆయన చెబుతున్న మావిగన్‌.. అమరావతి పరిధిలోకి వస్తుందనే విషయం ఆయనకసలు తెలుసా.. తెలిసినా విషప్రచారానికి ఒడిగట్టారా అనేది మరో ప్రశ్న. అమరావతికి చట్టబద్ధతపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైన తరుణంలో.. రాష్ట్రంలోని ప్రతిపక్షమైన వైసీపీ వ్యతిరేక గళం వినిపించడం ఎంతవరకు సబబని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.


ఎంతెంత విషమో..!

అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేసేందుకు 2014లో నిండు శాసనసభలో మద్దతు ప్రకటించిన జగన్‌.. రాజధానికి భూములివ్వొద్దని రైతులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. వడివడిగా నాడు సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం రికార్డు సమయంలో పూర్తికావడం..అధికారులు, ఉద్యోగులు అమరావతి నుంచే పనిచేయడం చూశాక.. దానిపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. అమరావతి పనుల్లో అవినీతి జరుగుతోందన్నారు. ఆ తర్వాత తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి రాగానే మోసగించారు. మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అమరావతి రైతులు, మహిళలను అవమానించారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూశారు. రాజధాని అమరావతేనని హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో జగన్‌ బిత్తరపోయారు. అయినా సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అన్నారు. విశాఖలో కాపురం పెట్టబోతున్నానన్నారు. ఇప్పుడేమో... విశాఖను పక్కనపెట్టి ప్లాన్‌-బి పేరిట ‘మావిగన్‌’ పాట పాడటం గమనార్హం.

Updated Date - Apr 03 , 2026 | 05:06 AM