Share News

జగన్‌.. ‘మావిగన్‌’!

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:56 AM

అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పాట పాడిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. ఇప్పుడు ‘ప్లాన్‌-బి’ పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు.

జగన్‌.. ‘మావిగన్‌’!

  • విశాఖ వద్దనుకుంటే ‘ప్లాన్‌-బి’ అట

  • మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో ‘మావిగన్‌’

  • అమరావతి మాత్రం ఆచరణ సాధ్యం కాదు

  • మేమొచ్చాక అసెంబ్లీ తీర్మానంతో మార్చేస్తాం

  • రాజ్యాంగంలో ‘రాష్ట్ర రాజధాని’ అనేదే లేదు

  • సానుకూల మీడియాతో జగన్‌ పలుకులు

అమరావతి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పాట పాడిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. ఇప్పుడు ‘ప్లాన్‌-బి’ పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు. బుధవారం ఒకవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతుండగా... మరోవైపు తాడేపల్లి ప్యాలె్‌సలో తన అనుకూల మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ నచ్చకపోతే.. ప్లాన్‌-బీ కింద మచిలీపట్నం (మా) -విజయవాడ (వి)-గుంటూరు (గన్‌) నగరాలను రాజధానిగా అభివృద్ధి చేయొచ్చని తెలిపారు. దీనికి ఎంచక్కా ‘మావిగన్‌’ అని పేరు పెట్టొచ్చన్నారు. ‘గన్‌’లో తన పేరు ఉన్నందున, అది నచ్చకపోతే ఇంకోపేరు పెట్టుకోవచ్చని కూడా సలహా ఇచ్చారు. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల హైవే ప్రాంతం పరిధిలో 110 ఎకరాల్లో రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయొచ్చని జగన్‌ పేర్కొన్నారు. ‘మావిగన్‌’పై తన అభిప్రాయాన్ని విన్నాక .. రాష్ట్ర ప్రజలు తనతో ఏకీభవిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి మాత్రం ఆచరణ సాధ్యం కాదని తేల్చేశారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీలో చట్ట సవరణ ద్వారా రాజధానిని మార్చేస్తామన్నారు. ‘‘రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని రాజధాని అమరావతితో రాష్ట్రానికి సంక్షోభం. కేవలం రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేస్తే రాష్ట్రంలో సంక్షేమం, పరిపాలన స్తంభించిపోతాయి’’ అని వివరించారు.


నేనొస్తే మార్చేస్తా...

రాజ్యాంగంలో దేశ రాజధానిపై నిర్వచనం ఉందే తప్ప.. రాష్ట్రాల రాజధాని ప్రస్తావనే ఎక్కడా లేదని జగన్‌ చెప్పారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్ట సవరణ చేసినా నిలువదన్నారు. భవిష్యత్‌లో ప్రజాభీష్టం మేరకు ఏర్పడే రాష్ట్రప్రభుత్వం.. రాజధానిని అమరావతి నుంచి మారుస్తూ చట్టసవరణ చేయవచ్చని చెప్పారు. ‘‘భవిష్యత్‌లో అమరావతిని మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు అంటున్నారు. వీళ్లు చట్టసవరణ చేయగా లేనిది.. భవిష్యత్‌లో మేము అసెంబ్లీలో చట్టసవరణ చేయలేమా?’’ అని జగన్‌ ప్రశ్నించారు. అమరావతికి చట్టబద్దత పేరిట ‘డైవర్షన్‌’ పాలిటిక్స్‌కు తెరతీశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక అమరావతిలో చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టి శిక్షిస్తామని చెప్పారు.

అమరావతిలో నేనే ఎక్కువ కాలం కాపురం చేశా!

అమరావతికి తాను ఏనాడూ వ్యతిరేకం కాదని, అందుకే శాసన రాజధానిగా ఏర్పాటు చేశానని తెలిపారు. అమరావతికి ఏ ఒక్కరూ వ్యతిరేకం కాదని, రాజధాని పేరిట చేస్తున్న అవినీతికే వ్యతిరేకమని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ కంటే తానే ఎక్కువ కాలం కాపురం చేశానని జగన్‌ చెప్పారు. తనకు అమరావతిపై అభిమానం ఉందనేందుకు చంద్రబాబు కంటే ముందుగానే తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టుకున్నానని.. ప్రస్తుతం అదే భూమిపై ఉండడమే సాక్ష్యమన్నారు. 2019 తర్వాత చంద్రబాబు అమరావతిలో కాపురం చేయలేదని.. అధికారంలోకి వచ్చాక కూడా వారంలో ఒకట్రెండు రోజులు హైదరాబాద్‌లో ఉంటున్నాడని చెప్పారు. ఇక పవన్‌ కల్యాణ్‌ వారంలో నాలుగు రోజులు కూడా అమరావతిలో ఉండడం లేదని.. ఆయన ఇక్కడ ఎప్పుడు ఉంటాడో చెప్పలేమన్నారు. లోకేశ్‌ కూడా హైదరాబాద్‌కు షటిల్‌ సర్వీస్‌ చేస్తున్నాడన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 04:56 AM