అంబటి సంస్కారం ఉన్న వ్యక్తి
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:05 AM
మాజీ మంత్రి అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అని, చేతనైతే ఆయనను పొగడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆయనను చేతనైతే పొగడాలి
కాపు కులంలో విలువలు ఉన్న నాయకుడు
టైగర్‌లా రాజకీయం చేస్తున్నారు
గుంటూరులో జగన్ వ్యాఖ్యలు.. అంబటి కుటుంబానికి పరామర్శ
గుంటూరు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అని, చేతనైతే ఆయనను పొగడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లు రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడిపిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుపై బూతులు మాట్లాడిన కేసులో జైలుపాలయిన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం గుంటూరులో వారి నివాసంలో కలిసి జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘అంబటి రాంబాబు కాపు కులంలో విలువలు ఉన్న వ్యక్తి. టైగర్‌లా రాజకీయం చేస్తున్నారు’’ అని జగన్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువులు, పంది, గొడ్డు కొవ్వు, చేపనూనె లేదని సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందన్నారు. అయినప్పటికీ చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ దీనిపై రాజకీయాలు చేస్తున్నారని, దేవుడంటే భయం, భక్తి లేకుండా తిరుపతి వెంకటేశ్వరస్వామి ప్రతిష్ఠని దెబ్బతీస్తున్నారన్నారు. ‘‘చేసిన తప్పులకు చెంపలేసుకుని ప్రజలను, వెంకటేశ్వరస్వామిని క్షమాపణలు కోరాల్సింది పోయి మళ్లీ అవే అబద్ధాలు ఆడుతూ, సీబీఐ చార్జిషీట్‌ని వక్రీకరిస్తూ, ఫ్లెక్సీలు పెట్టి కులమతాలను రెచ్చగొడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. అంబటి గుడిలో పూజ చేసుకుని వస్తుంటే, కర్రలు పట్టుకుని ఆయన కారును అడ్డగించి దుర్భాషలాడారని, దానికి ప్రతిస్పందనగానే ఆయన నోటి వెంట తిట్లు వచ్చాయన్నారు.
అంబటి ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని జగన్ ఆరోపించారు. చూస్తుండగానే రెండేళ్లు అయిపోయాయని, మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే తిరిగి వైసీపీయే అధికారంలోకి వస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లకు కొమ్ము కాస్తున్న పోలీసులపై ఎంక్వైరీకి ఆదేశిస్తామని, యూనిఫాం ఊడదీసి బొక్కలో పెట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై దాడులు ఇలానే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తామన్నారు. జగన్ తో కృష్ణా, పల్నాడు జిల్లాల నేతలు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉన్నారు.