అధికారంలో ఉంటే రెడ్లు..లేకపోతే కాపులు కావాలి!
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:10 AM
వైసీపీ అధినేత జగన్‌కు అధికారంలో ఉంటే రెడ్లు, అధికారంలో లేకపోతే కాపులు కావాలని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి వ్యాఖ్యానించారు.
జగన్ ఉచ్చులో పడి కాపులు మోసపోవద్దు
ముద్రగడ కుమార్తె క్రాంతి వినతి
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌కు అధికారంలో ఉంటే రెడ్లు, అధికారంలో లేకపోతే కాపులు కావాలని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి వ్యాఖ్యానించారు. ‘‘అంబటి రాంబాబుని వాడుకుని ఏవిధంగా అల్లర్లు చేయాలని చూస్తున్నారో, రేపు మా నాన్న(పద్మనాభం)ను కూడా వాడుకుని బలిపశువుని చేయరన్న గ్యారెంటీ ఉందా?. జగన్ ఉచ్చులో పడి కాపులు మరోసారి మోసపోవద్దు. శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ జరిగిందని సీబీఐ చార్జిషీటులో పేర్కొన్నా.. క్లీన్ చిట్ ఇచ్చేసిందన్న రీతిలో వైసీపీ వాళ్లు హడావుడి చేస్తున్నారు. 60 లక్షల కిలోల నెయ్యి భయంకరమైన రసాయనాలతో తయారైందని చార్జిషీట్‌లో తేల్చారు. విషయాన్ని దారి మళ్లించడం కోసమే అంబటి, జోగి రమేశ్‌తో సీఎంను దుర్భాషలాడించి రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్ చూస్తున్నారు.’’ అని విమర్శించారు. నెయ్యి కల్తీ జరిగిందని సీబీఐ చార్జిషీటులో పేర్కొన్నా.. అసలేమీ జరగలేదని మా నాన్న ఎలా అనగలుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు.