ప్రజారోగ్యంతో జగన్ చెలగాటం
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:55 AM
అధికారంలో ఉండగా వైసీపీ అధినేత జగన్.. ప్రజారోగ్యంతో చెలగాటమాడారని, ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ దుయ్యబట్టారు.
మంత్రి సత్యకుమార్
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉండగా వైసీపీ అధినేత జగన్.. ప్రజారోగ్యంతో చెలగాటమాడారని, ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలతోనూ ఆడుకుని, ప్రజల ప్రాణాల్ని ఫణంగా పెట్టారని ధ్వజమెత్తారు. చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం జగన్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. గంటల తరబడి మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మస్థుతి పరనిందలతో కాలం గడుపుతున్నారని, ఐదేళ్లు రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకుని, ఇప్పుడు నీతులు చెబితే ప్రజలు నమ్ముతారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, గతంతో పోల్చితే మరణాల సంఖ్యను తగ్గించామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. ఆసుపత్రుల్లో గర్భిణులకు, నవజాత శిశులకు అందుతున్న వైద్యం, ప్రసవ సమయంలో అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను గుర్తిస్తున్నామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.