కబ్జానేతకు జగన్ అండ!
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:04 AM
ఫోర్జరీ డాక్యుమెంట్లతో రికార్డులు సృష్టించి హైదరాబాద్ గండిపేట వద్ద ఏకంగా రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కేసులో అరెస్టయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు..
మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు మద్దతు
బొల్లా కుమారుడికి ఫోన్‌లో అభయం
ఏమీ కాదులే ధైర్యంగా ఉండు.. మేమున్నాం
మనవాళ్లంతా సపోర్టుగా ఉన్నారు కదా?
పొన్నవోలు సుధాకర్‌రెడ్డి టచ్‌లోకి వచ్చారా?
సజ్జల మాట్లాడుతున్నారా అంటూ వాకబు
సోషల్ మీడియాలో సంభాషణలు వైరల్
అమరావతి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఫోర్జరీ డాక్యుమెంట్లతో రికార్డులు సృష్టించి హైదరాబాద్ గండిపేట వద్ద ఏకంగా రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కేసులో అరెస్టయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. బొల్లా కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసి అభయమిచ్చారు. ధైర్యంగా ఉండాలని, ఈ కేసులో బ్రహ్మనాయుడుకు ఏమీ కాకుండా అందరమూ ఉన్నామంటూ జగన్ హామీ ఇచ్చారు. గిరిబాబుతో జగన్ ఫోన్‌లో మాట్లాడిన మాటలు యథాతథంగా సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ‘‘ఎలా ఉన్నావ్ గిరి? కేసుపై న్యాయపోరాటం చేస్తాం. ఏమీ కాదులే. ధైర్యంగా ఉండు. అందరమూ ఉన్నాం. మనవాళ్లంతా టచ్‌లో ఉన్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడా? పొన్నవోలు సుధాకర్‌రెడ్డి టచ్‌లోనికి వచ్చాడా? ఏమీ కాదులే .. భయపడకు’’ అని గిరిబాబుకు జగన్ భరోసా ఇవ్వగా.. అందరూ టచ్‌లో ఉన్నారని జగన్‌తో గిరిబాబు చెప్పారు. భూకబ్జా కేసులో అడ్డంగా దొరికిపోయిన నేతను ఏదో ఘనకార్యం చేసినట్లుగా జగన్ వెనకేసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేతలను రాజకీయపక్షాలు దూరంగా ఉంచుతాయి. హైదరాబాద్‌లో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం చిన్న విషయం కాదు. అక్కడి తహశీల్దారు ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును తమిళనాడులోని కాంచీపురంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఆయనకు 14 రోజులపాటు రిమాండు విధించింది. సహజంగా ఇలాంటి కేసుల్లో రాజకీయపక్షాలు జోక్యం చేసుకోవు. కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరే వేరు. బ్రహ్మనాయుడుకు మద్దతు పలకడమే గాక పార్టీ అంతా అండగా ఉంటుందని ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు.