Share News

నాడు ఒట్టి డ్రామా.. నేడు కపట ప్రేమ

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:02 AM

వైసీపీ అధినేత జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు అన్నివిధాలా మొండిచేయి చూపించారు. నాడు కార్మికుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు.

నాడు ఒట్టి డ్రామా.. నేడు కపట ప్రేమ

  • విశాఖ ఉక్కుపై జగన్‌ విన్యాసాలు

  • సీఎంగా ఉండగా స్టీల్‌ప్లాంటు భూములపై కుట్ర

  • అక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటుకు యోచన

  • కర్మాగారానికి సాయం చేసేందుకు నిరాకరణ

  • పెద్ద సంస్థలే విద్యుత్‌ బిల్లులు కట్టకపోతే ఎలాగంటూ కార్మిక నేతలకు ఎదురు ప్రశ్న

  • రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా మాంగనీస్‌ గనులను రెన్యువల్‌ చేయని వైనం

  • ఇప్పుడు ప్లాంటు ఉద్యోగులపై ప్రేమ ఒలకబోత

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ అధినేత జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు అన్నివిధాలా మొండిచేయి చూపించారు. నాడు కార్మికుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రమాదం జరగ్గానే విశాఖపట్నం వచ్చి ఉక్కు ఉద్యోగులు తన కుటుంబ సభ్యులన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన తీరు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అధికారం పోగానే ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో అని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరణ చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. జగన్‌ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా స్టీల్‌ ప్లాంటును అక్కడి నుంచి దూరంగా తరలించి ఆ భూముల్లో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని కుట్ర చేశారు. ఈ విషయాన్ని అప్పుడు జగన్‌ వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ విషయం బయట పడ్డాక ఉక్కు ఉద్యోగులంతా ‘అమ్మ జగనా... అంత కుట్ర చేశావా?’ అంటూ ముక్కున వేలేసుకున్నారు. అంతేకాకుండా తమను అవమానించిన సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతృత్వంలో పోరాటం ప్రారంభించారు. ధర్నాలు చేశారు. ఒక్కరోజు కూడా జగన్‌ సీఎం హోదాలో దీక్షా శిబిరం వద్దకు వచ్చి స్టీల్‌ ప్లాంటుకు మద్దతుగా మాట్లాడలేదు. విజయవాడ వెళ్లి ఆయన్ను కలిసి సమస్యలు చెప్పుకొందామని ఉక్కు సంఘాల నాయకులు ప్రయత్నిస్తే వారికి కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు.


విశాఖపట్నం పర్యటనకు వచ్చిన సందర్భంలో ఓసారి ఉక్కు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులను విమానాశ్రయానికి పిలిపించుకొని అక్కడే వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్లాంటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేయాలని వారంతా కోరారు. సొంత గనులు కేటాయించాలని, విజయనగరం జిల్లాలో మాంగనీన్‌ గనుల గడువు ముగిసిందని, దాన్ని రెన్యువల్‌ చేయాలని కోరారు. అంతేకాకుండా సొంతంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోలేక డిస్కమ్‌ నుంచి తీసుకుంటున్నామని, నెలకు రూ.90 కోట్ల విద్యుత్‌ బిల్లు వస్తోందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ మొత్తాలు చెల్లించలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. కొంత వెసులుబాటు కల్పించాలని, ఆరు నెలలు బిల్లులు కట్టడానికి గడువు ఇప్పించాలని అభ్యర్థించారు. అందుకు ఆయన నిరాకరించారు. ఒక్క సాయం కూడా చేయలేదు. డిస్కమ్‌లు నష్టాల్లో ఉన్నాయని, స్టీల్‌ప్లాంటు లాంటి పెద్ద సంస్థలే బిల్లులు కట్టకపోతే ఎలా అని, ఆ సాయం చేయలేమని తిరస్కరించారు. అలాగే మాంగనీస్‌ గనుల అనుమతిని రెన్యువల్‌ కూడా చేయలేదు. ఇక ఉక్కుకు సొంత గనులు తమ వల్ల కాదని చేతులెత్తేశారు.


కూటమి వచ్చాక ఆగిన ప్రైవేటీకరణ

తాను ప్రధానికి రెండు లేఖలు రాసి, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయిందని జగన్‌ మరో వింత ప్రకటన చేశారు. ‘ఆగిపోయింది’ అని చెప్పిన ఆయనే... ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని మరో డిమాండ్‌ చేశారు. నిజానికి... అప్పట్లో జగన్‌ చేసినవన్నీ ఉత్తుత్తి విన్యాసాలే. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రాన్ని ఒప్పించి ప్రైవేటీకరణను ఆపించింది. ఢిల్లీ నుంచి రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇప్పించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.3 వేల కోట్ల సాయాన్ని వివిధ రూపాల్లో అందించింది. విద్యుత్‌ బిల్లులకు రెండేళ్ల పాటు ఒత్తిడి లేకుండా చేసింది. అంతా సర్దుకున్నాక చెల్లించాలని, అంతవరకు బిల్లులు అడగవద్దని డిస్కమ్‌ అధికారులను ఆదేశించింది. ప్లాంటును మళ్లీ పట్టాలపైకి తీసుకువచ్చి, పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగేలా చేసింది. ఇవన్నీ మరిచిపోయి తానే స్టీల్‌ ప్లాంటు ఉద్ధరణకు నడుం కట్టినట్టుగా జగన్‌ ఇప్పుడు మాట్లాడడాన్ని ఉక్కు వర్గాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.

Updated Date - Jun 11 , 2026 | 04:03 AM