జగన్‌ది గొడ్డలి పార్టీ కాక మరేంటి?
ABN , Publish Date - May 04 , 2026 | 05:11 AM
ఒక్క అవకాశ మంటూ అధికారంలోకి వచ్చి గొడ్డలి సంస్కృతిని పెంచి పోషించినందుకే ప్రజలు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ఎద్దేవా చేశారు.
వైసీపీవి నేరపూరిత రాజకీయాలు
రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరం: నసీర్ అహ్మద్
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): ఒక్క అవకాశ మంటూ అధికారంలోకి వచ్చి గొడ్డలి సంస్కృతిని పెంచి పోషించినందుకే ప్రజలు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ గొడ్డలి పార్టీ కాక మరేమవుతుందని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో నసీర్ అహ్మద్ మాట్లాడుతూ తమది గొడ్డలి పార్టీ కాదని మాజీ మంత్రి విడదల రజని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సొంత బాబాయ్‌ని గొడ్డలితో నరికి చంపిన చరిత్ర కలిగిన వైసీపీని గొడ్డలిపార్టీ అనక మరేమంటారని ప్రశ్నించారు. అఽధికారం కోసం కన్నవాళ్లను బజారుకు ఈడ్చి, అడ్డు వచ్చిన వారిని అంతమొందించే మనస్తత్వం జగన్‌దని ఆరోపించారు. పరిటాల రవి నుంచి వివేకా హత్య వరకు రక్త చరిత్రను జగన్ కొనసాగిస్తున్నాడన్నారు. పరిటాల రవి, వివేకా హత్య కేసుల్లో సాక్షులను సైతం అంతమొందిన చరిత్ర అతనిదని విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త బాలయ్య యాదవ్ వంటి సామాన్య కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి, శవాన్ని ఇంటికి పంపిన అమానవీయ సంస్కృతి వైసీపీదన్నారు. మాస్కు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను వేధించి, ఆయన ప్రాణాలు పోయేలా చేశారని, గుంటూరు రమ్య, పలమనేరు మిస్బా, పులివెందుల నాగమ్మ.. ఇలా ఎందరో ఆడబిడ్డల హత్యలకు జగన్ పాలన కారణమని విమర్శించారు. నిందలు మోపి, మానసిక క్షోభకు గురిచేసి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రాణాలు తీసిన పాపం వైసీపీదేనన్నారు. సొంత పార్టీ నేతలను కూడా చిత్ర హింసలు పెట్టిన సైకో పార్టీ వైసీపీ అన్నారు. నేరపూరిత రాజకీయాలు చేస్తున్న జగన్, వైసీపీ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని విమర్శించారు.